ఈ మధ్య కాలంలో యువత, విద్యార్థులు ఎక్కువగా గూగుల్ పే ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపితే  రివార్డులు పొందే అవకాశం ఉండటంతో గూగుల్ పేపై ఆధారపడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి తన స్నేహితుడు మరో వ్యక్తికి 5000 రూపాయలు బదిలీ చేయమని కోరగా నగదు బదిలీ చేశాడు. కానీ అతడు ఊహించని విధంగా జమ్మూకశ్మీర్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. 
 
గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేస్తే పోలీసులు అరెస్ట్ చేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా...? పూర్తి వివరాలలోకి వెళితే జగిత్యాల జిల్లా కుస్థాపూర్ కు చెందిన లింగన్న దుబాయ్ లో ఉంటున్న రాకేశ్ అనే వ్యక్తికి 5000 నగదు పంపాలని తన స్నేహితుడు చెప్పగా యాప్ ద్వారా బదిలీ చేశాడు. లింగన్న నగదు బదిలీ చేసిన రాకేశ్ దేశద్రోహం కేసు కింద ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ పొలీసుల అదుపులో ఉన్నాడు. 
 
దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి నగదు బదిలీ చేయడంతో పోలీసులు లింగన్నను అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం రాకేశ్ జమ్మూకశ్మీర్ లోని ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. అక్కడి పోలీసులు అతనిని దేశద్రోహం కింద అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా రాకేశ్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. ఖాతాల పరిశీలనలో అతనికి లింగన్న డబ్బులు జమ చేసినట్టు తేలింది. 
 
కశ్మీర్ పోలీసులు తెలంగాణకు వచ్చి లింగన్నను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో లింగన్న నుండి పోలీసులు సమాచారం సేకరిసున్నారు.  టెర్రరిస్టులకు ఆర్థిక సహాయం అందించాడనే ఆరోపణలతో పోలీసులు లింగన్నను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు అపరిచిత వ్యక్తులకు నగదు బదిలీ చేయవద్దని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: