ఖాళీ అవబోతున్న రాజ్యసభ  స్ధానాల విషయంలో వైసిపి నేతల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. వైసిపికి దక్కబోయే నాలుగు స్ధానాల్లో ఒకదాన్ని ఇతరులకు త్యాగం చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది. రిలయన్స్ అధినేత, కుబేరుడు ముఖేష్ అంబానీ అంతటి వ్యక్తి వచ్చి తనకు అత్యంత సన్నిహితుడైన పరిమళ్ ధీరజ్ నత్వానీకి ఒక స్ధానాన్ని వైసిపి కోటాలో కేటాయించాలంటూ రిక్వెస్ట్ చేయటంతో పార్టీ సమీకరణలే మారిపోతున్నాయి.

 

నిజానికి పార్టీకి వచ్చే నాలుగు సీట్లను  ఎవరికి కేటాయించాలనే విషయంలో పెద్ద కసరత్తే జరిగింది. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బిసి, రెడ్డి, ఎస్సీ సామాజికవర్గాలకు నాలుగు సీట్లను కేటాయించాలని జగన్ అనుకున్నాడట. ఇందులో బిసి అయితే బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రెడ్లయితే అయోధ్య రామిరెడ్డి, మేకాటి రాజమోహన్ రెడ్డి పేర్లు చూస్తున్నారు. ఎస్సీ అయితే మాజీ ఎంపి పండుల రవీంద్ర తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

 

అయితే హఠాత్తుగా నత్వానీ పేరు తెరపైకి రావటంతో సమీకరణలు మారబోతున్నాయి. ముఖేష్ కోటాలో ఓ రాజ్యసభ కేటాయించటం వల్ల జగన్ కు దీర్ఘకాలిక ఉపయోగాలు చాలానే ఉన్నాయట. నిజానికి పార్టీలో ఏ సామాజికవర్గానికి చెందిన నేతకు రాజ్యసభ స్ధానం  కేటాయించినా పార్టీకి పెద్దగా లాభం ఏమీ ఉండదు. పార్టీకి విధేయుడికి టికెట్ దక్కిందన్న సంతృప్తి తప్ప. పైగా రాజ్యసభ ఎంపిలైన నేతలు కూడా తమ సామాజికవర్గానికి చందిన ఓట్లను కూడా పార్టీకి వేయించలేరన్నది వాస్తవం. ఏ సామాజికవర్గం ఓట్లు పార్టీకి పడినా అదంతా జగన్ ను చూసి రావాల్సిందే.

 

అదే ముఖేష్ అడిగినట్లు ఓ రాజ్యసభ కేటాయిస్తే అందుకు బదులుగా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రిలయన్స్ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అంతేకాకుండా పరిశ్రమ ఏర్పాటైన చుట్టుపక్కల ప్రాంతం కూడా ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. దీని వల్లే పార్టీకి ఎక్కువగా ఉపయోగమనే చెప్పాలి. కాబట్టి దీర్ఘకాలిక ప్రయోజనాలను చూసుకుంటే మాత్రం ఓ సీటును త్యాగం చేయటంలో తప్పే లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: