టీఆరెస్ లో ఆ మాజీమంత్రికి పెద్దగా  ప్రాధాన్యత లేకుండా పోయిందా ?, ముఖ్యమంత్రి కేసీఆరే కాదు , పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు , మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు కూడా ఆయన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదా ?? అంటే అవుననే పార్టీ వర్గాలు అంటున్నాయి . ఆ మాజీ మంత్రి మరెవరో కాదు జూపల్లి కృష్ణారావు . ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న జూపల్లి , తెలంగాణ ఉద్యమ సమయం లో కాంగ్రెస్ వీడి టీఆరెస్ లో చేరారు . టీఆరెస్ తొలిప్రభుత్వం లో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు .

 

అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు . ఎన్నికల అనంతర  రాజకీయ పరిణామాల నేపధ్యం లో హర్షవర్ధన్ కాంగ్రెస్ వీడి టీఆరెస్ లో చేరడం... కేసీఆర్ , కేటీఆర్ లు ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండడం తో ,  జూపల్లి కి పార్టీ లో క్రమేపి ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది  . అయితే తానేంటో పార్టీ నాయకత్వానికి రుచి చూపించాలన్న కసితో జూపల్లి , ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను కొల్లాపూర్ మున్సిపల్ బరిలో నిలిపి మెజార్టీ సంఖ్యలో గెలిపించుకున్నారు .

 

కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం పార్టీ నాయకత్వం  తనతో రాయభారం నెరుపుతుందని భావించిన జూపల్లికి నిరాశే ఎదురయింది . తాజాగా జరిగిన సహకార సంఘ ఎన్నికల్లోను  జూపల్లి తన అనుచరులను పెద్ద సంఖ్యలో గెలిపించుకుని , పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని కలిసే ప్రయత్నం చేయగా,  దానికి కేటీఆర్ ఆయనకు అంతసమయం ఇవ్వకుండానే ముఖం తిప్పుకుని వెళ్లినట్లు తెలుస్తోంది .     

మరింత సమాచారం తెలుసుకోండి: