స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను  ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చామని సీఎం గుర్తుచేశారు.  దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికిగాను ఓ యాప్‌.. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద ఉండాలన్నారు. 

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ సీఎం జగన్, అధికారులతో సమీక్ష జరిపారు. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని అధికారులను ఆదేశించారు జగన్. నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలన్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణల కోసం  ఆర్డినెన్స్ తెచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల్లో నగదు, మద్యం పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతోనే ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. నగదు పంపిణీ చేసినట్లు ఎన్నికల తర్వాత నిర్ధారణ అయినా అనర్హత వేటు వేస్తామనీ..మూడేళ్లు  జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. నగదు, మద్యం అరికట్టాలని, స్థానిక ఎన్నికలను సవాల్‌గా తీసుకోవాలనీ .. పోలీసులకు సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలు, గ్రామంలో మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా నగదు, మద్యం పంపిణీ చేశారన్న మాట రాకూడదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడం కాదని.. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవ చేసే వ్యక్తులే ఎన్నికవ్వాలని సీఎం ఆకాంక్షించారు.

 

అమరావతి కేసులకు సంబంధించి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ముకుల్ రోహ్గతి లాంటి లాయర్‌ను నియమించిన ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఫెయిలైందని చంద్రబాబు ప్రశ్నించారు. నెలరోజుల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని జగన్ అంటున్నారని...మరి వెనకబడిన వర్గాల రిజర్వేషన్లను కాపాడడం ప్రభుత్వ బాధ్యత కాదా అని చంద్రబాబు నిలదీశారు. కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామంటున్న జగన్.. వెనకబడిన వర్గాల ప్రయోజనాలను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు అధికార, విపక్షాలు స్థానిక పోరుకు సన్నద్ధమవుతున్నాయి. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహా రచనలో నిమగ్నమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: