2014 ఎన్నికల్లో మోడీ అధికారంలోకి రావడానికి సోషల్‌ మీడియా పాత్ర అనిర్వచనీయం. ప్రచారంలో తీవ్రంగా కష్టపడటంతో పాటు... సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకోవడం కూడా మోడీకి కలిసొచ్చింది. ఒక రకంగా తనను ఈ స్థాయిలో నిలబెట్టిన సోషల్‌ మీడియాకు మోడీ దూరం కావాలని ఆలోచిస్తుండటం... ఆయన అభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు, ఫాలోవర్స్‌కు మింగుడు పడని విషయమే.

 

2014 ఎన్నికలకు ముందు నుంచే సోషల్‌ మీడియాలో ఉన్న మోడీ... సరిగ్గా ప్రచారం ప్రారంభమయ్యే టైమ్‌కి ఏకంగా ఓ భారీ వ్యవస్థను సృష్టించుకుని మరీ ఓటర్లకు రీచ్‌ అయ్యారు. 5 గురు అత్యంత సన్నిహితులు.. 15 మంది మాజీ ఐఏఎస్‌లు.. 250 మంది యువ ఐఐటీయన్లు.. 1000 మంది స్ట్రాటజిస్ట్‌లతో అహ్మదాబాద్‌లో ఓ వార్‌ రూమ్‌ను ఏర్పాటు చేసుకుని... ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ద్వారా ఒక్క క్లిక్‌తో ఓటర్లకు తాను అనుకున్నది చెప్పగలిగారు. ఆ ఎన్నికల్లో 15 కోట్ల మంది యువ ఓటర్లు ఓటు హక్కు పొందగా... వాళ్లలో 80 శాతం సోషల్‌ మీడియా ప్రచారం కింద ఉండటంతో... వాళ్లను రీచైతే కనీసం ఎనిమిది కోట్ల ఓట్లు దక్కించుకోవచ్చనే ఆలోచనతో... ఆ రూట్లో అడుగులేశారు. నగరాల్లో ఉన్న అర్బన్ ఓటర్లను ప్రభావితం చేసే బలమైన శక్తిగా... సోషల్‌ సైట్లలో దూసుకుపోయారు. 

 

నాలుగైదు విభాగాలుగా విడిపోయిన మోడీ టీమ్‌... ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, న్యూస్‌బ్లాగ్స్‌, వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ వంటి వాటిల్లో నమో మంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది.  సోషల్‌ సైట్లలో మోడీ పోస్ట్‌లపై వచ్చే కామెంట్లను రీసెర్చ్‌ చేసి, మోడీకి అసవరమైన డేటా అందించేది. మోడీని ఇంటర్నెట్లో అనూహ్యంగా ప్రొజెక్ట్‌ చెయ్యడంలో ఈ టీం సూపర్ సక్సెస్‌ అయ్యింది. అప్పట్లో మోడీ ప్రధాని అన్న వీడియోని కోటి ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మోడీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లకు కోటి ముప్పై లక్షల లైక్‌లు తెచ్చిపెట్టారు. అంతే కాదు ఆయన ఎఫ్‌బీ అకౌంట్‌కి అరవై లక్షల మంది ఫాలోయర్లను సాధించారు. ఆయన ట్వీట్లను కూడా క్షణాల్లో 25 లక్షల మందికి రీచ్ అయ్యేలా డెవలప్‌ చేశారు. మోడీ ఆన్‌లైన్‌ ప్రచారం అప్పట్లో ఏ స్థాయికి వెళ్లిందంటే... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా చేసిన ఆన్‌లైన్‌ ప్రచారానికి మోడీ ప్రచారం పోటీ పడే స్థాయికి వెళ్లిందట. అందుకే... వరల్డ్‌ వైడ్‌గా మోడీని సోషల్‌ మీడియా ప్రచారం పాపులర్‌ చేసింది. 

 

2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఉన్న 594 ఎంపీ సెగ్మెంట్లలో కనీసం 160 సెగ్మెంట్ల ఫలితాల్ని సోషల్‌ మీడియా ప్రభావితం చేసిందని IRSI నాలెడ్జ్‌ ఫౌండేషన్,  ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సర్వే చేసి మరీ చెప్పాయి. అందుకే సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఆ ఎన్నికల్లో మోడీ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా సీట్లు సాధించగలిగారు. ఇక 2019లో రకరకాల కారణాల వల్ల తిరుగులేని ఆధిక్యంతో మోడీ సాధించిన విజయం వెనుకా... సోషల్‌ మీడియా ప్రభావం అంతో ఇంతో ఉంది. తాను ఈ స్థాయిలో ఉండటానికి కాస్తోకూస్తో కారణమైన సోషల్‌ మీడియాను... ఇప్పుడు మోడీ పూర్తిగా దూరంగా పెట్టగలరా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో వస్తోంది. ఒకవేళ ఆయన కొన్నాళ్లు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా... ఎన్నికల టైమ్‌లో మాత్రం సోషల్‌ మీడియాను ఉపయోగించుకోకుండా ఉండరనేది... మరికొందరి విశ్లేషణ. చూద్దాం... సోషల్ మీడియా విషయంలో మోడీ నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: