కరోనా.. ఈ పేరు వింటే చాలు ప్రపంచమంతా వణికిపోతోంది. ఆర్ధిక వ్యవస్థలు అల్లాడిపోతున్నాయి. జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఈ వైరస్.. హైదరాబాద్ లోనూ ఎంటరైంది. మరి ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా ? కరోనా కబంధ హస్తాల నుంచి మనం బయటపడలేమా ? ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు.. మనకు వినిపిస్తున్న సమాధానం ఒక్కటే ? అవును.. కరోనాను ఎదురించగలం. ఆ వైరస్.. విలయం సృష్టించకుండా ఆపగలం. ఇందుకు మన దక్షిణాది రాష్ట్రమే ఉదాహరణ. వాళ్లు ఎదుర్కొన్న తీరే మనకిప్పుడు ఆదర్శం.

 

ఇది కరోనా సృష్టిస్తున్న కలకలం. దాదాపు రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి.. మనదాకా రాలేదులే అని కాస్త నింపాదిగా ఉన్నాం. అక్కడా, ఇక్కడా అనుమానిత కేసులే తప్ప.. పాజిటివ్ అని తేలకపోవడంతో రిలాక్స్ అయ్యాం. కానీ, అనుకున్నదంతా అయింది. ఆ రక్కసి.. హైదరాబాద్ లో ఎంటరైపోయింది. ఇక ముందు ముందు ఏం జరగబోతోందో అన్న టెన్షన్.. ఇప్పుడు తెలుగు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మామూలుగా జనసాంధ్రత తక్కువగా ఉన్న దేశాల్లోనే ఇది మరణ మృదంగం మోగిస్తోంది. అదే మన దేశంలో ఇది విజృంభిస్తే.. పరిస్థితి ఏంటన్న ఆందోళన ఇన్నాళ్లూ వ్యక్తమైంది. ఇప్పుడు ఇది తలచుకుంటేనే.. అందరిలో ఆందోళన కనిపిస్తోంది. మరి ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేది ఎలా ? కోవిడ్ కు ఎదురునిలిచేది ఎలా ? ఈ ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మనకు సమాధానం ఇస్తోంది.. కేరళ.

 

మనదేశంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది కేరళలోనే. అది కూడా ఒకటి కాదు.. ఏకంగా మూడు. అయితే ఆ మూడు కేసుల్లో బాధితులు.. ఇప్పుడు కరోనా నుంచి బయటపడ్డారు. ఇప్పుడంతా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే.. కరోనా బాధితులను దాని బారి నుంచి రక్షించడమే కాదు.. అది ఇతరులకు వ్యాప్తి చెందకుండా సమర్ధంగా వ్యవహరించింది కేరళ సర్కార్. ఇప్పుడు అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. అసలు, ఇది ఎలా సాధ్యమైంది ? మూడు పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు.. అక్కడ వైద్యులు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారు ? ఆ వైరస్ ఇతరులకు సోకకుండా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది ? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ మనకు హాట్ టాపిక్ గా మారాయి. మళయాళీలు ఎదుర్కొన్నట్లు మనం కూడా ఇప్పుడు కలిసికట్టుగా స్పందిస్తే.. కరోనాపై విజయం సాధించగలం. తెలుగు రాష్ట్రాలను.. ఆ రక్కసి నుంచి కాపాడగలం.

 

కరోనా ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో.. కేరళ స్ఫూర్తిదాయకంగా  వ్యవహరించింది. కేరళ ప్రభుత్వం.. వేగంగా రియాక్ట్ అయింది. మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాక.. రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కరోనా గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రజల్లో అవగాహన కల్పించింది. వైద్య సదుపాయాలు.. విస్తృతంగా ఏర్పాటు చేసింది. కరోనా అనుమానిత కేసుల్ని పరీక్షించేందుకు, వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఒకానొక దశలో ఫిబ్రవరి నాలుగున.. కేరళలో వంద వరకు కరోనా అనుమానిత కేసులు ఉండేవి. ఇప్పుడు అవి పదికంటే తక్కువగా ఉన్నాయి. కరోనా బాధితుల్ని 14 రోజులపాటు ఐసోలేటెడ్ గా అంటే వేరుగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రమాణాలు నిర్దేశిస్తే.. కేరళ ప్రభుత్వం ఆ బాధితుల్ని 28 రోజులుగా నిర్ణయించింది. అంటే.. కరోనా ఇతరులకు సోకకుండా ఉండేందుకు ఎలాంటి రిస్క్ తీసుకోలేదన్నమాట. ఇలాంటి చర్యల వల్ల కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అయింది ఆ రాష్ట్రం. 

 

భారత్ లాంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశంలో.. ప్రజల్లో అవగాహన కల్పించడం అన్నది మామూలు విషయం కాదు. కరోనా లాంటి వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తున్నప్పుడు.. ప్రజలు కూడా అవగాహనతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మాములు దగ్గు, జలుబు, జ్వరానికి.. కరోనా లక్షణాలకు తేడా ఉంటుంది. పైగా ఎక్కడికి వెళ్లకుండా గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఉన్నవారికి ఈ వైరస్ సోకే ప్రమాదం లేదు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడంలో సక్సెస్ అయింది కేరళ ప్రభుత్వం. దానివల్ల అసలైన కరోనా బాధితులకు సమన్వయంతో చికిత్స అందించడం సులువైంది. అంతేకాకుండా  ఎంతమందిని పరీక్షలు నిర్వహించారు ? ఎంతమందిని వేరుగా ఉంచి  చికిత్స అందించారు ? ఎంతమందిని డిశ్చార్జ్ చేశారు అనే సమాచారాన్ని.. ప్రతిరోజు విడుదల చేయడం ద్వారా రూమర్స్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోగలిగింది. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. అందుకే గతనెలలో వందకు పైగా అనుమానిత కేసులకు చికిత్స అందించి.. అందరినీ కరోనా నుంచి బయటపడేలా చేయగలిగారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: