ఏపీలో జగన్ సర్కారు మద్యం రేట్లు పెంచిందనీ.. హానికరమైన బ్రాండ్లు అమ్ముతోందని టీడీపీ కొన్నిరోజులుగా విమర్శిస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ ఇవ్వాలనుకున్నారో ఏమో టీడీపీ నేత బొండా ఉమ... రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్స్ ను తన టేబుల్ పై ఒక వైపు, టీడీపీ హయాంలో విక్రయించిన బ్రాండ్లను మరోవైపు వరుసగా పెట్టుకుని విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

 

ఏపీలోనే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా చూడనటువంటి హానికరమైన బ్రాండ్స్ ను తన ‘J-ట్యాక్స్’ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తోందని, ‘హైదరాబాద్ లో పేమెంట్.. తాడేపల్లిలో ఇండెంట్ జరుగుతోందని విమర్శించారు. కేవలం, మద్యంపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.300 కోట్ల పైచిలుకు కమీషన్లు కొట్టేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో మద్యం దుకాణాలకు ఇచ్చిన ధరల పట్టికను, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలకు ఇచ్చిన ధరల పట్టికల ప్రతులను విలేకరులకు చూపించారు.

 

 

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జార్డీస్ బార్’ బ్రాండ్ విస్కీ, ‘బూమ్’ బీరును విక్రయిస్తున్నారని అన్నారు. మన దేశంలోనే కాదు జగన్ కు ఇష్టమైన దక్షిణాఫ్రికా దేశంలో కూడా ఈ బ్రాండ్ కనబడదని విమర్శించారు. ప్రతి బీరు కేసుకు ఒక రేటు, చీప్ లిక్కర్ కు మరో రేటు, ప్రీమియం లిక్కర్ కు ఇంకో రేట్ పెట్టి తమ కమీషన్ల కోసం పేదోడి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

 

 

అయితే ఇష్యూ ఎలా ఉన్నా.. వైన్ బాటిళ్లతో ప్రెస్ మీట్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేత బొండా ఉమా పెట్టిన ప్రెస్‌మీట్‌ చూస్తే చాలా సిగ్గుచేటు అనిపిస్తోందన్న విమర్శలు వచ్చాయి. తన ముందర బ్రాండ్స్‌ పెట్టుకొని ఏదో వైన్‌ షాపులో సెల్స్‌ మెల్స్‌లా మాట్లాడారని.. . కళ్లుతాగిన కోతి ఏవిధంగా ప్రవర్తిస్తోందో.. టీడీపీ నేతల ప్రవర్తన కూడా అలాగే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. సోషల్ మీడియాలోనూ బోండా ఉమ ప్రెస్ మీట్ నవ్వులపాలైంది. టీడీపీ ఆఫీస్‌లోనే బాటిల్స్‌ పెట్టుకొని ప్రెస్‌మీట్లు పెడుతుంటే..అవి టీడీపీ ఆఫీసా? లేక లోకేష్‌ వైన్‌షాపా?.. అన్న అనుమానం వస్తోందంటూ విమర్శలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: