కరోనా వైరస్ లేదా కోవిడ్‌- 19.. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న వైరస్ ఇది. తెల్లారింది మొదలు.. కరోనా వైరస్‌పై రకరకాల వార్తలు. మృతుల సంఖ్య పెరుగుతోందనీ, మరింత మందికి వ్యాపించిందనీ చెబుతుంటే ప్ర‌జ‌ల్లో భ‌యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే 2000 పైచిలుకు జనం ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తున్న ఈ వైరస్.. ప్ర‌స్తుతం భారత్‌లోకి ప్రవేశించింది. 

 

హైదరాబాద్‌‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో జంట నగరాలు భయం గుప్పిట్లో చేరిపోయాయి. ఇక మహేంద్రా హిల్స్ పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు సైతం జంకుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో మెట్రో రైలు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.

 

మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజలు తాకే ప్రదేశాల్లో ప్రత్యేక పరిశుభ్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. మెట్రో రైళ్లలో అనౌన్స్‌మెంట్ల ద్వారా కరోనాపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నట్లు మార్చి 3న ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్‌పై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు ఎలాంటి భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని సూచించిన సంగ‌తి తెలిసిందే. మ‌రియు కరోనా విషయంలో ఆందోళన చెందవద్దని, ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే తెలియ‌జేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: