దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో కేరళలో మూడు కేసులు నమోదవగా... సోమవారం రోజున ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తి భార్యకు కూడా కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. కేంద్రం కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేసింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం కరోనా భారీన పడకుండా జాగ్రత్త పడవచ్చు. 
 
వీలైనంత వరకు జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే వైరస్ సోకినవారి లాలాజలం లేదా ఇతర స్రావాల వల్ల వైరస్ ప్రభావం మనపై పడవచ్చు. చాలామందికి వైరస్ సోకినా కొన్ని రోజుల వరకు లక్షణాలు కనిపించవు. వయస్సును బట్టి లక్షణాలు కనిపించటానికి 4 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. 
 
వైరస్ ఉందని అనుమానం వచ్చిన వస్తువులను తాకితే చేతుల అన్ని భాగాలను శుభ్రం చేసుకోవాలి. ఎల్లప్పుడూ వ్యక్తిగత వస్తువులు, టవల్స్, ఆహారం, కప్పులు, పాత్రలను ఇతరులతో పంచుకోకూడదు. కరోనా లక్షణాలు ఉన్నాయని అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం. దగ్గు, తుమ్ము వచ్చినపుడు డిస్పోజబుల్ టిష్యూతో కవర్ చేసుకోవాలి. 
 
ఏ కారణం వలన బయటకు వెళ్లాల్సి వచ్చినా మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఒక మాస్కును ఒకరోజుకు మించి ఉపయోగించకూడదు. ఒకసారి ఉపయోగించిన మాస్కును మళ్లీ వాడకూడదు. ఎవరైనా దగ్గు, తుమ్ము లక్షణాలతో కనిపిస్తే వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. తాజా సమాచారం మేరకు ఢిల్లీలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నిన్న పరీక్షించిన 45 మంది అనుమానితుల రిపోర్టులు నెగిటివ్ వచ్చాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: