2013వ సంవత్సరంలో ఒడిశా రాష్ట్రం పట్కూర ఏరియాలోని చౌలియా గ్రామానికి చెందిన అభయ్ సుతారకి, ఇతిశ్రీ మొహరానా కి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగిన రెండు నెలలకే భార్య అంతూపంతూ లేకుండా అదృశ్యమైంది. దీంతో షాకైన వరుడు తన భార్యకి ఏమైందో, ఎక్కడికెళ్ళిందోనని కంగారుపడిపోయాడు. మరోవైపు భార్య తల్లిదండ్రులు భర్తపై అనుమానం పెంచుకున్నారు. ఒకానొక రోజు ఇతిశ్రీ తండ్రి ప్రహల్లాద్ మొహరానా... పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురిని అభయ్ కుటుంబ సభ్యులు వరకట్నం కోసం చిత్రహింసలు పెట్టి, చివరికి చంపేశారని ఫిర్యాదు చేశాడు.



దీంతో కేసు నమోదు చేసుకున్న ఒడిశా పోలీసులు అభయ్ ని అరెస్టు చేసి తమదైన శైలిలో నాలుగు తన్ని విచారించారు. అయినను తనకి ఏ పాపం తెలియదని చెప్పుకొచ్చాడు అభయ్. కానీ పోలీసులు మాత్రం అతడి మాటల్ని పట్టించుకోకుండా మరొక కేసు అతని పై వేసి జైలు కు పంపించేశారు. ఐతే నెల రోజులు గడిచిన తరువాత అభయ్ బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆ తర్వాత తనలో తాను ఆలోచించుకుంటూ... 'నేను ఏం తప్పు చేయనప్పటికీ... నా మీద తప్పుడు కేసు పెట్టి నా పరువు మొత్తం పోయేలా చేశారు. అస్సలు దీనంతటికి కారణం నా భార్య. అదృశ్యమైన నా భార్య ఆచూకీని పోలీసులు ఎలాగు కనుక్కోలేరు. నేనే దాని కోసం వెతుకుతా. సమాజంలో నా మీద పడిన నిందని తుడిచేసుకుంటా ', అని అభయ్ నిర్ణయించుకున్నాడు.

 



భార్య ఆచూకీ కోసం వెతికే ముందు పెళ్లయిన కొత్తలో తను భార్యతో గడిపిన సమయాన్ని, ఆమె పెట్టిన ముచ్చటలని, ఆమె బిహేవియర్ ని అన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. చివరికి తన భార్య ఎవరితోనో వెళ్లిపోయిందని బలంగా అనుమానించాడు. ఆ తర్వాత తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. తన భార్యకు తెలిసిన వాళ్ళ ప్రతి ఇంటికి కాళ్లరిగేలా తిరిగాడు. తన భార్య ఒక్కరితోనైనా కచ్చితంగా టచ్లో ఉంటుందోనని భావించిన భర్త ఆమెకు తెలిసిన ప్రతి ఒక్కరిని ఆరా తీసి వారు ఇచ్చిన హింట్స్ లను నిశ్చింతగా క్రోడీకరించి అనుమానం వచ్చిన చోట్ల గత ఏడేళ్లుగా తిరిగగా, ఎట్టకేలకు ఆమె ఆచూకీ దొరికింది. పిపిలి అనే పట్టణంలో దొరికిన ఆమె చాలా జాలిగా కనిపించింది. కాసేపటి తర్వాత తన ప్రియుడు కూడా కనిపించాడు. ఇది కంఫర్మ్ చేసుకున్న భర్త తిరుగుమొహం పట్టి నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. అయ్యా, పోలీసులు మీరు నా మీద పెట్టిన కేసు తప్పుడు కేసు. సమాజంలో నా పరువు తీశారు. నా భార్యని నేను చంపలేదు. గత ఏడేళ్లుగా దర్యాప్తు చేసి మరీ ఆమె ఎక్కడుందో కనిపెట్టాను. కావాలంటే మీరు వెళ్లి పిపిలి లో ఫలానా గ్రామంలో వెతకండి' అంటూ చెప్పుకొచ్చాడు.

 



ఇదంతా వింటున్న పోలీసులు ఆశ్చర్యపోయి... నిజామా అంటూ అతను చెప్పిన అడ్రస్ కి వెళ్లి ఇతిశ్రీ ని, తన ప్రియుడు రాజీవ్ లోచన్ ని పోలీస్ స్టేషన్ కి పట్టుకొచ్చారు. అప్పుడు ఇతిశ్రీ మాట్లాడుతూ... 'మీ బాధ ఏంటిప్పుడు? అభయ్ ని పెళ్లి చేసుకోక ముందు నుండే నాకు రాజీవ్ తో సంబంధం ఉంది. అయినా మా వాళ్లు నాకు బలవంతంగా అభయ్ తోటి పెళ్లి చేశారు. నాకు రాజీవ్ మాత్రమే కావాలనుకున్నాను. అందుకే ఒక మంచి రోజు చూసుకొని నా ప్రియుడి వద్దకు వెళ్లిపోయాను. ఇన్ని రోజులు వాడితోనే ఉన్నాను, ఇకమీద కూడా వాడితోనే ఉంటాను. ఏం చేస్తారు మీరు?' అంటూ పోలీసులపై మండిపడింది ఇతిశ్రీ.



దీంతో ఆమెపై ఏం కేసు పెట్టాలో తెలియక... ఒడిశా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు అభయ్ మాత్రం ఫుల్ ఖుషి అవుతూ... 'హమ్మయ్య, నా పైన ఎన్నో కేసులు బనాయించినా... ఇప్పుడు నేను నిర్దోషినని నిరూపించుకున్నాను. దొరికిపోయిన నా భార్య ని మీరు ఏదైనా చేసుకోండి. నాకనవసరం' అంటూ మీడియా ఎదుట తన ఉపశమనాన్ని వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఇతిశ్రీ నైతికంగా తప్పు చేసింది కానీ చట్టపరంగా ఆమె చేసింది తప్పేమీ కాదు. దీంతో ఆమె పై కేసు కూడా నమోదు కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: