దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసుల్లో దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ ను ఈరోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిర‌స్క‌రించారు. సుప్రీం కోర్టు క్యురేటివ్ పిటిషన్ ను కొట్టివేసిన తరువాత పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను పెట్టుకున్నారు. ఈరోజు రాష్ట్రపతి పిటిషన్ ను తిరస్కరించడంతో నిర్భయ దోషులకు అతి త్వరలో ఉరి శిక్ష అమలు కానుంది. 
 
మార్చి 3వ తేదీనే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉన్నా రాష్టపతి దగ్గర పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో పాటియాలా కోర్టు స్టే విధించింది. దోషులు ఇప్పటికే శిక్ష అమలును ఆపాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఉరి శిక్షను ఆపాలనే ఉద్దేశంతో పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశాడు. న్యాయస్థానం పిటిషన్ కొట్టివేయడంతో చివరి అవకాశంగా క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకున్నాడు. 
 
కేంద్ర హోం శాఖ రాష్టపతికి ఈ పిటిషన్ ను పంపింది. పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరి తీయడానికి ఇక ఏ విధమైన ఆటంకాలు ఉండవని తెలుస్తోంది. 2012 డిసెంబర్ నెలలో ఆరుగురు కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టారు. బాధిత యువతి సింగపూర్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జైలులో ఆత్మహత్య చేసున్నాడు. 
 
మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలుశిక్ష అనంతరం విడుదలయ్యాడు. నలుగురు దోషులకు ఉరి నుండి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవని సమాచారం. కోర్టు ఈ నెల 20వ తేదీలోగా కొత్త డెత్ వారంట్ జారీ చేసే అవకాశం ఉంది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష త్వరగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: