సాధారణంగా యువ నేతలు ఎవరైనా సీనియర్ నేతలని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే దివంగత వైఎస్సార్ మీద అభిమానంతో చాలామంది యువ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రజలకు చేసిన సేవలని చూసి, స్పూర్తి పొంది ప్రజాక్షేత్రంలోకి దిగారు. అలా వైఎస్సార్‌ని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుల్లో టి‌జే‌ఆర్ సుధాకర్ బాబు కూడా ఒకరు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన విద్యార్ధి దశ నుంచే కాంగ్రెస్ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు.

 

మొదట నుంచి కాంగ్రెస్‌లో కష్టపడటం చూసి, 2004లో వైఎస్సార్ ఈయనకు స్టేట్‌ యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ పదవి ఇచ్చారు. ఇక ఆ పదవికి పూర్తిగా న్యాయం చేయడంతో 2007లో కాంగ్రెస్‌ యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడుగా చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న సుధాకర్ అప్పటిలోనే ప్రతిపక్ష టీడీపీపై దూకుడుగా వెళ్ళేవారు. వైఎస్సార్‌ని ఒక్కమాట అంటే వెంటనే టీడీపీపై ఫైర్ అయ్యారు. అయితే 2009లో వైఎస్సార్ చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ పెట్టిన ఈయన మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

 

ఈ క్రమంలోనే 2012లో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెచ్చుకున్నారు. అయితే రాష్ట్ర విభజన, 2014 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా అయిపోవడంతో 2017లో వైసీపీలో చేరి, అధికార ప్రతినిధిగా బాగా కష్టపడ్డారు. పార్టీ వాయిస్‌ని బలంగా వినిపించారు. దీంతో జగన్, సుధాకర్‌ని 2018లో సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. అలాగే 2019 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

 

తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు అసెంబ్లీ, ఇటు మీడియాల్లో చంద్రబాబుని ఏకీపారేస్తారు. ఇక నియోజకవర్గంలో ప్రజలకు బాగానే అందుబాటులో ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాగో అమలు మామూలుగానే జరుగుతుంది. అయితే ప్రెస్ మీట్లు పెట్టి మరి టీడీపీ మీద దూకుడుగా వెళ్ళే సుధాకర్...నియోజకవర్గంలో అభివృద్ధి చేసే విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నట్లు కనిపించడం లేదు.  మరి అధికారంలోకి వచ్చి 9 నెలలే అయింది కాబట్టి, రానున్న రోజుల్లో అభివృద్ధిలో దూకుడుగా ఉంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: