ఈరోజు వెలగపూడి సచివాలయంలో ఏపీ కేబినేట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది రోజున 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. 26,976 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 16,164 ఎకరాల ప్రైవేట్ భూముల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేయబోతున్నట్టు చెప్పారు. 
 
ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలలో నిర్మాణమయ్యే కాలనీలకు వైయస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేయాలని కేబినేట్ నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి అనుమతిపత్రంతోపాటు, స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి... ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వనుంది. కేబినేట్ కొత్త విధానం ప్రకారం రాష్ట్రంలో ఎన్పీఆర్ ను అమలు చేయకూడదని నిర్ణయించింది. 
 
కేబినేట్ ఎన్పీఆర్ లో మార్పులు కోరుతూ తీర్మానం ఆమోదించిందని పేర్ని నాని చెప్పారు. ఎన్పీఆర్ లో మార్పులు చేసిన తరువాత రాష్ట్రంలో ఎన్పీఆర్ అమలవుతుందని చెప్పారు. జీఎమ్మార్ సంస్థకు విశాఖలో 2700 ఎకరాలు కేటాయించామని కేబినేట్ 2700 ఎకరాల్లోంచి 200 ఎకరాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేబినేట్ నిర్ణయం ప్రకారం సంస్థ 2500 ఎకరాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మించాల్సి ఉంది. 
 
ఏపీ ప్రభుత్వం ఉగాది రోజున భారీ స్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్న విషయం తెలిసిందే. దాదాపు ప్రతి ఊరిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదలకు భారీగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన కాలనీలకు ఇందిరమ్మ కాలనీలు అని పేరు పెట్టారు. వైసీపీ వైయస్సార్ జగనన్న కాలనీ అనే పేరు పెట్టడంతో ప్రజల్లో వైయస్సార్, జగన్ పేర్లు చిరకాలం నిలిచిపోనున్నాయి.                   

మరింత సమాచారం తెలుసుకోండి: