చంద్రబాబు నాయుడు తర్వాత 38 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు ఎవరంటే? అందరూ నారా లోకేశ్ పేరే చెబుతారు. చంద్రబాబు తర్వాత చినబాబే పార్టీ పగ్గాలు తీసుకుంటారని ఇప్పటికే అర్ధమైపోయింది. అయితే అంతపెద్ద పార్టీని నడిపే సామర్ధ్యం....జగన్, పవన్ లాంటి యువ అధినేతలని ఢీకొనే సత్తా గానీ చినబాబుకు ఉందా? అంటే గత ఐదేళ్లు చినబాబు పనితీరు చూశాక లేదని మొహమాటం లేకుండా చెప్పేయొచ్చు.

 

ఏదో చంద్రబాబు తన తనయుడుని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, ప్రజాక్షేత్రంలో పోటీ చేయించకుండా ఎమ్మెల్సీని చేసి, మంత్రిని కూడా చేశారు. అయితే లోకేశ్ మంత్రిగా ఎలా పని చేశారు. ఆయన మాటతీరు వల్ల పార్టీకి నష్టం వచ్చిందో, లాభం వచ్చిందో చూశాం కూడా. ఇక ఆయన పనితీరు కొలమానంగానే 2019 ఎన్నికలు మంగళగిరిలో ఫలితం వచ్చింది. తొలిసారి పోటీలో దిగి ఓటమి పాలయ్యారు.

 

ఇక ఓడిపోయాక లోకేశ్ సోషల్ మీడియా వేదికగానే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు తప్ప, బయటకొచ్చి పెద్దగా మాట్లాడలేదు. కానీ అధినేత చంద్రబాబుకు తప్పదు కాబట్టి, ఓడిపోయిన ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా లోకేశ్‌లో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. రాజధానుల అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి లోకేశ్ పార్టీలో గట్టిగానే కష్టపడుతున్నారు. తండ్రికి అండగా నిలబడుతున్నారు. తాజాగా టీడీపీలోని యువనేతలకు విందు ఇచ్చి, భవిష్యత్ నాయకుడుని తానే అనే సిగ్నల్స్ పంపారు.

 

ఆ విందు తర్వాత ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తూర్పుగోదావరి పర్యటనకు వెళ్ళి టీడీపీ శ్రేణులని ఉత్తేజపరిచారు. పైగా ఆయన స్పీచ్‌లో కూడా మార్పు కనిపిస్తుంది. మునుపటి మాదిరిగా తడబడకుండా, తప్పులు లేకుండా వైసీపీ మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. అలాగే రాజకీయాల్లో లాంగ్వేజ్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ బాగుండాలనే సూత్రాన్ని లోకేశ్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

 

ఎందుకంటే ఆయన అంతకముందు చాలా లావుగా ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నారు. అయితే లోకేశ్ చాలారోజుల నుంచి బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే మాటతీరుని కూడా మెరుగుపరుచుకోవడానికి కష్టపడుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఈ మధ్య చినబాబులో భారీ మార్పే వచ్చినట్లు కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: