నిత్యం తుపాకీగుళ్ల చప్పుళ్లు వినిపించే అఫ్గనిస్థాన్లో శాంతి సుమాలు విరబూస్తాయనే ఆశలపై నీళ్లు చల్లే విధంగా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రకటన చేశారు. వేలాది మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసేది లేదని ఆయన ప్రకటించారు. దీంతో అమెరికా, తాలిబన్ శాంతి ఒప్పందం చివరకు ఎటు దారితీస్తుందోనిని సామాన్య అఫ్గన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు.  

 

14 నెలల్లో సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని అమెరికా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సహకరిస్తామని తాలిబన్లు హామీలివ్వడంతో.. దోహాలో ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కాకపోయినా.. ఆ దిశగా తొలి అడుగు పడిందని అందరూ అనుకున్నారు. కానీ డీల్ జరిగిన గంటల వ్యవధిలోనే అఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్ ప్రభుత్వంతో తాలిబన్లు చర్చలు జరపడానికి ఖైదీల్ని విడుదల చేయాల్సిన పనిలేదని, సంప్రదింపులు మొదలయ్యాక.. వాటి ఫలితాలను బట్టే విడుదల ఉంటుందని ఆయన చెబుతున్నారు. కానీ తాలిబన్లు మాత్రం మొదట ఖైదీల విడుదల.. తర్వాతే చర్చలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 

 

అమెరికా, తాలిబన్ డీల్ అమలుకు 14 నెలలు కూలింగ్ పీరియడ్ ఉంది. ఈ సమయాన్ని ఉపయోగించుకొని.. తాలిబన్లు బయట స్వేచ్ఛగా తిరుగుతారని, మళ్లీ పాత వాసనలు బయటపెడితే పరిస్థితేంటని అఫ్గాన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు మరీ భయపడుతున్నారు. గతంలో తాలిబన్ల హయాంలో నరకం చూసిన మహిళలు ఇప్పుడిప్పుడే స్వేచ్ఛగా జీవనం గడుపుతున్నారు. మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తే.. తమ పరిస్థితులు దిగజారతాయని, తినడానికి తిండి కూడా దొరకదని వాపోతున్నారు. అటు శాంతి ఒప్పందం కూడా పూర్తిగా అమెరికాకే అనుకూలంగా ఉందని, అఫ్గనిస్థాన్ పరిస్థితి నడిసంద్రంలో నావలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

రష్యాతో కోల్డ్ వార్ టైమ్ లో ముజాహిదీన్లను దువ్విన అమెరికా.. తర్వాత వారిలో చీలికలు తెచ్చి.. తాలిబన్లకు మద్దతిచ్చింది. కానీ అఫ్గనిస్థాన్ లో అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడటంతో.. తాలిబన్లలో ఓ గ్రూపు అల్ ఖైదాగా ఏర్పడింది. అల్ ఖైదా అధినేత బిన్ లాడెన్ ఆదేశాల ప్రకారం న్యూయార్క్ ట్విన్ టవర్స్ పై దాడి జరిగింది. ఆ తర్వాత అమెరికా అఫ్గనిస్థాన్లో అడుగుపెట్టి.. తాలిబన్లను గద్దె దించింది. పాక్ లో దాక్కున్న లాడెన్ ను చంపేసింది. కానీ 19 ఏేళ్లైనా అఫ్గనిస్థాన్లో శాంతిని మాత్రం నెలకొల్పలేకేపోయింది. సుదీర్ఘ కాలం యుద్ధం చేసిన తర్వాత ఎవరూ గెలిచే పరిస్థితి లేదని అటు అమెరికా, ఇటు తాలిబన్లు గ్రహించడంతో.. 2018లో శాంతి ఒప్పందం ఆలోచనకు బీజం పడింది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక సైన్యం ఉపసంహరణకు పట్టు బట్టడంతో.. డీల్ ముందుకెళ్లింది. 

 

ట్రంప్ తరపున మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి కూడా అఫ్గనిస్థాన్ లోనే పుట్టి పెరిగారు. ఆయనకు తాలిబన్ల సిద్ధాంతాలు, మనస్తత్వాలపై పూర్తి అవగాహన ఉంది. కానీ ట్రంప్ సైన్యం ఉపసంహరణే ప్రధానంగా చర్చలు జరపాలని సూచించడంతో.. శాంతి, కాల్పుల విరమణ లాంటి అంశాలు వెనక్కెళ్లిపోయాయి. ఇప్పుడు కుదిరిన ఒప్పందంతో అమెరికా సైన్యం అఫ్గనిస్థాన్ ను వదలిపెట్టి రావడానికి సాకు దొరికినట్టైంది. కానీ అఫ్గనిస్థాన్ లో  నెత్తురుటేళ్లు పారించి, దశాబ్దాల తరబడి అక్కడ తిష్ఠ వేసిన అమెరికా సైన్యం.. శాంతియుత వాతావరణం ఏర్పాటు చేస్తామని ప్రపంచానికి మాటిచ్చింది. కానీ ఇప్పుడు చేస్తామన్న పని సగంలోనే వదిలేసి స్వప్రయోజనాల కోసం అఫ్గనిస్థాన్ ను తాలిబన్లకు అప్పగించేయడానికి రెడీ అవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. 

 

ఇప్పటికీ అఫ్గనిస్థాన్ లో తాలిబన్ల నియంత్రణలో కొన్ని ప్రాంతాలున్నాయి. అక్కడ అఫ్గన్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. అఫ్గన్ మహిళలకు స్వేచ్ఛ, అధికారాలు అన్నీ పట్టణ ప్రాంతాలకే పరిమితం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ముల్లాల రాజ్యమే నడుస్తోంది. తాలిబన్లు ప్రతిరోజూ అఫ్గన్ సైన్యాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సైన్యం వెళ్లిపోతే.. తమ సైన్యం సంగతేంటనేది అఫ్గన్ ప్రభుత్వానికి అర్ధం కావడం లేదు. అఫ్గాన్ సైన్యం ఇంకా అన్నిరకాలుగా సుశిక్షితమైన విభాగం కాదు. దానికి కనీసం మన పోలీసుల స్థాయి సామర్థ్యం అయినా ఉందా.. లేదా అనేది అనుమానమే. అలాంటి సైన్యం దేశాన్ని ఎలా రక్షిస్తుంది, అఫ్గన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎలా బతికిస్తుందనేది సమాధానం లేని ప్రశ్నే. కానీ అమెరికా మాత్రం మీ తిప్పలేవో మీరు పడండి.. ఇక మా వల్ల కాదంటూ చేతులెత్తేసి పీస్ డీల్ పేరుతో అఫ్గన్ ప్రభుత్వం ముందరి కాళ్లకు బంధాలు వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: