మంచిర్యాల జిల్లాలో సర్కార్ భూములైనా...అసైండ్ ల్యాండైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. చెరువు శిఖాలు.. కాల్వలు సైతం కూల్చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. బడాబాబుల అండతో కొంతమంది రెచ్చిపోతుంటే, మరికొంతమంది అధికారులను మచ్చిక చేసుకొని  భూముల్ని మాయం చేస్తున్నారు. 

 

మంచిర్యాల జిల్లా ఇల్లీగల్ దందాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చక్రం తిప్పుతున్నారు.అడ్డొస్తే బెదిరించడం..లేదంటే ఎందులోనైనా ఇరికించడం.. అధికారులనైతే బదిలీ చేయించడం అక్కడ పరిపాటే. 

 

కొత్తగా జిల్లా ఏర్పడటంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. గజం భూమి ధర సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. అసలే సింగరేణి ప్రాంతం..ఆపై జిల్లా ఏర్పడింది.. పైగా అభివృద్ధిలో దూసుకుపోతుంది..ఈక్రమంలో రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కొంతమంది డబ్బున్న బడాబాబులు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. పట్టణ ప్రగతిలో వాటిపని పడతామంటున్నారు మున్సిపల్ చైర్మన్. 

 

మంచిర్యాల పట్టణంలోని రాళ్ల వాగు ఆనుకొని ఉన్న భూములు కబ్జాల పాలౌతున్నా పట్టించుకునే నాథుడే లేడు. చెరువు, కుంట కనిపిస్తే చాలు క్షణాల్లో మాయం చేస్తున్నారు. హద్దులు పెట్టినా.. చెరిపేసి రాత్రికి రాత్రే పెన్షింగ్ వేసి కబ్జా చేస్తున్నారు. రాముని చెరువు, చమ్మచెరువు,సాయికుంట,నస్పూర్ లోని ఊరి చెరువు కబ్జాకు గురౌతుందని స్థానికులు మొత్తుకుంటున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో మొత్తం పదిహేను సర్వే నంబర్ల పరిధిలోని 61 ఎకరాల్లో అక్రమ లేఔట్లు చేశారని అధికారులు గుర్తించారు. డీటీసీపీ అప్రూవల్ లేకుండా ఉన్న లే ఔట్ల పై చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రభుత్వ భూములను రక్షించాలని, రియల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తానికి భూ కబ్జాదారుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ ఖర్చీఫ్ వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: