తెలంగాణలో కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం వారిలో భ‌రోసా పెంచేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచడం సహా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

 

 


అనంత‌రం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటికే వైద్యారోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని  తెలిపారు. 'కరోనా వైరస్‌ గాలితో ఇతరులకు వచ్చే ఆస్కారం లేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ వచ్చిన వారిలో ౩శాతం కూడా మరణాలు లేవు. కరోనా వైరస్‌ ఉన్నవారు మాట్లాడినప్పుడు తుప్పిర్లు ముఖంపై పడితే వచ్చే అవకాశం ఉంది. వైరస్‌ వచ్చిన వ్యక్తి కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే అవకాశం ఉంది` అని మంత్రి తెలిపారు.

 

 

 

క‌రోనా వ్యాధి విష‌యంలో 9 ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయ‌ని మంత్రి వివ‌రించారు.  ప్రతి శాఖకు ఒక నోడల్‌ అధికారి ఉంటారని మంత్రి తెలిపారు.  చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామన్నారు. ప్రయివేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని మంత్రి చెప్పారు. కరోనా అనుమానితులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరామని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. 

 


కాగా, క‌రోనా వైర‌స్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పోస్టర్‌ను విడుదల చేసింది. వైరస్‌ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమని, ముఖ్యమైన సూచనలు పాటించాలని సూచించారు. 

 

 

కాగా,  గాంధీ ఆస్పత్రిలో మీడియాపై ఆంక్షలు విధించారు. గాంధీలోకి మీడియాకు అనుమతి లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న మీడియా వాహనాలను తక్షణమే తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. అనుమతి లేనిదే జర్నలిస్టులు లోపలికి ప్రవేశించకూడదని ఆదేశాలు జారీ చేశారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: