తెలంగాణలో వరుసగా కరోనా కేసులు నమోదవుతోన్న నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మాస్క్ లు ధరించి ,  పరీక్షలు రాయడానికి విద్యాశాఖ అనుమతినిచ్చింది . ఇక జలుబు , దగ్గుతో బాధపడే విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నారు . అదే సమయం లో ఇన్విజిలేటర్లు ఎవరైన జలుబు , దగ్గు తో బాధపడుతుంటే మాత్రం వారికి  విధుల  నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది .

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరీక్షాకేంద్రాలను శుభ్రంగా ఉంచాలని సూపరిండెంట్లను ఆదేశించింది . రాష్ట్ర వ్యాప్తంగా 1339 పరీక్షా కేంద్రాల్లో 9 .56 లక్షల మంది  ఇంటర్ మొదటి , ద్వితీయ సంవత్సర విద్యార్థులు  పరీక్షలు రాస్తున్నారు . వీరంతా వివిధ కేంద్రాల్లో పరీక్షలు రాసే సమయంలో తోటివిద్యార్థులు జలుబు , దగ్గుతో బాధపడుతుంటే భయాందోళనలు చెందే అవకాశాలు లేకపోలేదు . అందుకే జలుబు , దగ్గుతో బాధపడే విద్యార్థులుంటే  వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ ఆదేశించింది . ఇక పరీక్షా కేంద్రాల్లో  నీళ్లు తాగడానికి విద్యార్థులు సంకోచించే అవకాశం ఉండడంతో , వారిని పరీక్షా కేంద్రాలకు వాటర్ బాటిల్స్ తెచ్చుకోవడానికి అనుమతినిచ్చింది .

 

హైదరాబాద్ నగరం లో  రెండు కరోనా కేసులు నమోదైన నేపధ్యం లో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు . కరోనా వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని భయం వారిని  వెంటాడుతోంది . అందుకే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేవిధంగా అన్ని  ముందు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు . అయితే ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి వచ్చినవారికి మాత్రమే కరోనా వైరస్ సోకిందని , స్థానికులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వైద్య అధికారులు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు . కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కూడా ప్రకటించింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: