ఏపీ లో జగనన్న చంద్రన్నను మించిపోయేలా ఉన్నాడు.. ఎందులో అంటారా.. పథకాలకు పేర్లు పెట్టుకోవడంలో.. గతంలో ఒకనేత బతికి ఉన్నప్పుడు ఆయన పేరుతో పెద్దగా పథకాలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మనం పోయాక మన పేరు పెట్టుకుంటారో లేదో.. తలచుకుంటారో లేదో అన్న అనుమానమో.. లేక ఎప్పుడో తలచుకుంటే ఎందుకు ఇప్పుడే మన గురించి నలుగురూ చెప్పుకోవాలన్న తత్వమో ఏమో కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.

 

 

ఈ ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది చంద్రబాబే అని చెప్పుకోవచ్చు. ఏపీకి అత్యధిక కాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు మొదట్లో ప్రభుత్వ పథకాలకు అన్న ఎన్టీఆర్ పేరు పెట్టేవారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2014లో సీఎం అయ్యాక ఏకంగా తన పేరే పెట్టుకోవడం ప్రారంభించారు. చంద్రన్న కానుక, చంద్రన్న భీమా ఇలా చంద్రన్న పేరుతో పథకాలు ప్రారంభించారు. వాస్తవానికి చంద్రబాబును చంద్రన్న అనడం తక్కువ. అది అచ్చం అన్న ఎన్టీఆర్ కు కాపీయే.

 

 

ఇప్పుడు ఆ ట్రెండ్ ను తాజా సీఎం జగన్ అందిపుచ్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. జగన్ కూడా అధికారానికి వచ్చిన కొత్త లో ప్రతి పథకానికి వైఎస్సార్ పేరు పెట్టేవారు. కానీ అప్పుడే జగన్ కు తండ్రి పేరు కన్నా సొంత పేరుపై మమకారం పెరిగినట్టుంది.. అప్పుడే జగన్ పేరుతో పథకాలు మొదలైపోయాయి. జగనన్న కానుక, జగనన్న అమ్మ ఒడి.. అంటూ జగనన్న పాట పాడటం ప్రారంభించారు.

 

 

ఇప్పుడు ఈ ట్రెండ్ కొనసాగేలాగానే కనిపిస్తోంది. తాజాగా ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ సర్కారు.. ఆ కాలనీలకు విచిత్రమైన పేరు పెడుతోంది. అదేంటో తెలుసా.. వైఎస్సార్ జగనన్న కాలనీలు అట. ప్రభుత్వం ఉగాదికి పేదలకు ఇవ్వబోతున్న పట్టాల భూమిలో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ఎకరాల ప్రైవేట్‌ భూములు కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటికి యుద్ధ ప్రాతిపాదికన లేఅవుట్లు ఏర్పాటు చేసి, గ్రావెల్‌ రోడ్లు వేసి స్థలాలు ఇవ్వబోతున్నారు. ఈ కాలనీలను వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేయబోతున్నారు. మరి ఇక ఈ జగనన్న జాబితా ఇంకెంత పొడుగు ఉంటుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: