ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ నెల 21న, మున్సిపల్ 24న, పంచాయతీ ఎన్నికలు 27న నిర్వహించనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో పోలింగ్ తేదీలను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి 21, 24, 27 తేదీలలో పోలింగ్ నిర్వహించాలని సూచించనున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. 
 
కేబినేట్ భేటీ అనంతరం జగన్ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని సీఎం చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తున్నామని, పారదర్శక పాలన అందిస్తున్నామని జగన్ సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా పథకం ద్వారా 47 లక్షల రైతు కుటుంబాలు, అమ్మఒడి పథకం ద్వారా 42 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందాయని సీఎం చెప్పినట్లు సమాచారం. 
 
స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, 2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు రావాలని జగన్ మంత్రులను ఆదేశించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మెరుగైన ఫలితాలు రావాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని... మంత్రులు సరైన వ్యూహాలతో ముందుకు సాగాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలని... పార్టీలో సమస్యలుంటే పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సమావేశంలో సీఎం ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎక్కడా కనిపించకూడదని మరోసారి స్పష్టం చేశారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు తేలితే ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: