స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైసీపీ చేసిన ప్రయత్నానికి బ్రేక్ పడింది. హైకోర్టులో కొందరు పిటీషన్ వేయడం వల్ల ఆ రిజర్వేషన్లను కొట్టేసింది. అయితే ఇదంతా చంద్రబాబు పనే అంటున్నారు వైసీపీ నేతలు. బీసీలపై చంద్రబాబుది సవతి ప్రేమ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లడం, స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

 

 

చంద్రబాబు తన మనిషితో కావాలనే కేసు వేయించారంటూ.. ఆ కేసు పెట్టిన వ్యక్తి వివరాలను వెల్లడించారు. చంద్రబాబు గుంట నక్కలా వ్యవహరించి బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి చేత కోర్టులో ఫిటిషన్‌ వేయించారు. కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌. ఈ ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై పిటిషన్‌ వేయడంతో ఆ కోర్టు హైకోర్టుకు సూచించింది. దీంతో హైకోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని సూచించిందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

 

 

అంతే కాదు.. ఈ చంద్రబాబు ద్రోహ చరిత్రకు 35 ఏళ్ల రికార్డు ఉందని మంత్రి గుర్తు చేస్తున్నారు. ఆయన ఏమన్నారంటే.. “ బీసీలను చంద్రబాబు 35 ఏళ్లుగా మోసం చేస్తున్నారు. రిజర్వేషన్లపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. 2018లో చంద్రబాబు కోర్టులో వేసిన అఫిడవిట్‌లో వేసిన ప్రధాన అంశం ఇలా ఉంది..తెలంగాణ విషయంలో అప్పట్లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు రాష్ట్రాలకు కామన్‌గా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం వాదనలు వినిపించిందని గుర్తు చేశారు.

 

 

ఆ రోజు ఉన్న సుప్రీం కోర్టు యధావిధిగా 60 శాతం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్పు ఇచ్చింది. మళ్లీ 2016లో మరో తీర్పు ఇస్తూ ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యాయి కాబట్టి ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పిందన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు ఒకపక్క బీసీలపై ప్రేమ అంటారు.. మరోపక్క బీసీలకు వ్యతిరేకంగా తన మనిషితో సుప్రీం కోర్టులో కేసు వేయిస్తాడు. ఈ రోజు తీర్పు అనుకూలంగా రాకుండా చేస్తారు. ఈ రోజు వచ్చి బీసీలపై సవతి ప్రేమ చూపుతూ.. కుళ్లు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి: