ఏపీ సీఎం జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వాన్ని పేదల నుంచి బలవంతంగా అసైన్డ్ భూములను లాక్కొని మరొకరికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం చెట్లు కొట్టేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూములు సమకూర్చే చోటుకు భారీగా పోలీసులను పంపుతోందని అందుకు కారణాలు తెలపాలని కోరింది. 12వ తేదీన డీజీపీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 
 
ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కార్యదర్శి మాల్యాద్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం అధికారులు బలవంతంగా తీసుకుంటున్నారని, పట్టాలు లేని పేదలను ఖాళీ చేయించకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. 
 
హైకోర్టు లేఖను సుమోటాగా స్వీకరించి పిటిషన్ ను విచారించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం బలవంత భూ సేకరణ చేయడం లేదని... పోలీసుల ఫోటో భూ సమీకరణకు సంబంధించినది కాదని చెప్పారు. ఏజీ కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కోరడంతో కోర్టు విచారణను 12కు వాయిదా వేసింది. రాజధాని భూముల్లో పిచ్చి మొక్కలను తొలగించటానికి ప్రభుత్వం పిలిచిన టెండర్ ప్రక్రియ నిలువరించాలని న్యాయవాదులు కోరగా కోర్టు అందుకు అంగీకరించలేదు. 
 
అసైన్డ్ భూముల వివాదానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతుండటంతో ఈ నెల 25న ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్ పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు అసైన్డ్ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ నెల 12న జరిగే విచారణ తరువాత కోర్టు తీర్పును బట్టి పథకం అమలు గురించి స్పష్టత రానుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: