ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) అనారోగ్యం కారణంగా ఈరోజు ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పొత్తూరి వెంకటేశ్వరరావు బంజారాహిల్స్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. పత్రికారంగంలో దాదాపు ఐదు దశాబ్దాల పాటు వెంకటేశ్వరరావు విశేష సేవలందించారు. 
 
1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో పొత్తూరి వెంకటేశ్వరరావు జన్మించారు. 1957లో ఆంధ్రజనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, వార్త లాంటి ప్రముఖ పత్రికల్లో పని చేశారు. పొత్తూరికి రచయితగా కూడా మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా పొత్తూరి పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
నాటి పత్రికల మేటి విలువలు పేరిట ఆయన రచించిన పుస్తకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ పుస్తకంతో పాటు చింతన, చిరస్మరణీయులు అనే మరో పుస్తకాన్ని రచించారు. పొత్తూరి పీవీ గురించి రాసిన 'ఇయర్ ఆఫ్ పవర్'కు సహ రచయితగా పని చేశారు. పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆయన మృతి పత్రికారంగానికి తీరని లోటు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పొత్తూరి మృతిపట్ల సంతాపం తెలిపారు. 
 
జగన్ పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరవరానిదని పేర్కొన్నారు. పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు.. తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఆయన మరణం తీరని లోటు అని అన్నారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: