స్థానిక సంస్థల సమరం మొదలు కానుండటంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు అధికార వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తుంటే, అటు వైసీపీని ఎదురుకుని చెప్పుకోదగిన స్థానాలు గెలవాలని టీడీపీ చూస్తోంది. ఆ మేరకు బలమైన చోట సత్తా చాటాలని చంద్రబాబు ఇప్పటికే నేతలకు ఆదేశాలు జారీ చేసేశారు. దీంతో నేతలు స్థానిక సంస్థలపై గురి పెట్టారు. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

 

అయితే టీడీపీ ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే మాత్రం పూర్తిగా సైలెంట్ ఉన్నారు. గత కొంతకాలం నుంచి కొన్ని కారణాల వల్ల ఆయన నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉండటం లేదని తెలిసింది. అలా సైలెంట్ అయిపోయిన ఎమ్మెల్యే ఎవరో కాదు...టీడీపీలో ఎస్సీ సామాజికవర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే బాల వీరంజనేయ స్వామి. ఈయన ప్రకాశం జిల్లా కొండపి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అయితే రెండోసారి విజయం సాధించిన స్వామి పార్టీలో బాగానే పని చేసుకుంటున్నారు.

 

నియోజకవర్గంలో ప్రజల సమస్యల తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అటు అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై పోరాటాలకు పిలుపునిస్తే, యాక్టివ్‌గా పాల్గొనేవారు. అయితే చంద్రబాబు జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర జరిగిన దగ్గర నుంచి స్వామి సైలెంట్ అయిపోయారు. ఆఖరికి ఆయన ఫేస్‌బుక్ పేజ్‌లో నియోజకవర్గం గురించి అప్‌డేట్స్ ఇవ్వడం మానేశారు. ఈ విధంగా స్వామి సైలెంట్ అయిపోవడానికి పెద్ద కారణమే ఉందని ప్రకాశం టీడీపీ కేడర్ చర్చించుకుంటుంది. వైసీపీ నేతలు స్వామిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

 

కాకపోతే ఆయన వైసీపీలోకి వెళ్లడానికి ఇష్టపడలేదని, ఈ క్రమంలోనే వైసీపీ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయని, దీంతో ఆయన టీడీపీలో ఉంటూనే సైలెంట్ అయిపోయారని ప్రకాశం టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. స్థానిక సమరం దగ్గరలో పడిన స్వామి మాత్రం నియోజకవర్గంలో తిరగడం లేదట. మరీ ఇబ్బందులు ఎక్కువైతే ఆయన వైసీపీలోకి కూడా వెళ్లిపోవచ్చని ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే కొండపి ఎమ్మెల్యే డౌట్ డౌట్‌గానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: