తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ కరోనా భయంతో వణుకుతుండగా.. మైండ్ స్పేస్ ఘటనతో.. టెకీలు ఉలిక్కిపడ్డారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే గాంధీలో కరోనా వార్డు తరలించాలన్న జూనియర్ డాక్టర్ల వినతిపై మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

కరోనాకు చికిత్స చేసేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ ఆస్పత్రుల కోసం తెలంగాణ వైద్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ప్రతి ఆస్పత్రిలో కరోనా అవగాహన కోసం కరపత్రాలు, బోర్డులు ఏర్పాటుచేయాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను ఇతరులతో కలపొద్దని, వారి వైద్య పరీక్షల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కరోనా అనుమానితుల శాంపిళ్ల సేకరణ మొత్తం ప్రొటోకాల్ ప్రకారమే జరగాలని, కరోనా వార్డులో వేస్ట్ మేనేజ్‌మెంట్ చేయాలని ఆదేశించింది. ఆస్పత్రిలోని డాక్టర్లకు, ఇతర సిబ్బందికి అవగాహనా సదస్సులు నిర్వహించాలని వైద్యశాఖ సూచించింది. 

 

కరోనా పేరు చెబితేనే సికింద్రాబాద్ లోని మహేంద్ర హిల్స్‌ ప్రాంతం నిలువెల్లా వణికిపోతోంది. ఇక్కడ రవి కాలనీకి చెందిన యువకునికి కరోనా సోకడంతో... స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే బాధితుడి కుటుంబీకులకు పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో వారిని ఇంటికి పంపేశారు వైద్యులు. అయితే వైద్యుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేస్తూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు మహేంద్ర హిల్స్‌ ప్రాంతంలో పాఠశాలలు ప్రారంభం అయినా..  పిల్లలు  మాత్రం రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే  వెంటనే ఇళ్లకు పంపుతున్నారు. 

 

హైదరాబాద్ అంతా కరోనా భయంతో వణికిపోతోంది. ముఖ్యంగా కరోనా బాధితుడు నివసించిన ప్రాంతంతో పాటు విదేశీయుల రాకపోకలు ఎక్కువగా ఉండే చోట స్థానికులు కరోనా పేరు చెబితే ఉలిక్కిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ ప్రజలయితే ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు. స్థానిక మహిళ ఒకరు ఇటలీ నుంచి వచ్చి కొంపల్లిలోని ఓ హోటల్‌లో బస చేశారన్న సమాచారమే ఈ ఆందోళనకు కారణం. ఫిబ్రవరి 28న ఇటలీ నుంచి వచ్చిన ఓ 32 ఏళ్ల మహిళ కొంపల్లి జాతీయ రహదారి సినీ ప్లానెట్ పక్కన ఉన్న హోటల్‌లో బస చేశారు. అక్కడినుంచి మరొక హోటల్‌కు వెళ్లిన ఆమె ఇప్పుడు కరోనా లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో వైద్యశాఖాధికారులు తనిఖీలు నిర్వహించేందుకు రాగా, హోటల్ యాజమాన్యం సహకరించలేదు. పేట్ బషీర్ బాద్ పోలీసులు, కొంపల్లి మున్సిపల్ కమిషనర్ సర్దిచెప్పడంతో తర్వాత తనిఖీలకు ఒప్పుకున్నారు. హోటల్‌ సిబ్బందితో పాటు  చుట్టుపక్కల ఉన్నవారికి జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. 

 

గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వార్డు తొలగించాలంటున్నారు  జూనియర్ డాక్టర్లు. తెలంగాణ నలుమూలల నుంచి గాంధీ ఆస్ప్రతికి ఎంతోమంది రోగులు వస్తుంటారని, కరోనా బాధితులు ఇక్కడ ఉంటే ఆ రోగులకు ఇబ్బందని జుడాలంటున్నారు. కరోనా వార్డును శివారు ప్రాంతాలకు తరలించాలని కోరుతూ  జుడాలు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిశారు. స్థానికులు కూడా కరోనా వార్డును తరలించాలని విజ్ఞప్తి చేశారు. 
కరోనా విషయంలో కొందరు డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై సీరియస్‌ అయ్యారు తెలంగాణ మంత్రి ఈటెల. 

మరింత సమాచారం తెలుసుకోండి: