ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత నాలుగు రోజులుగా రిజర్వేషన్లు రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మొత్తం రిజర్వేషన్లని 59.85 శాతం(బీసీలకు 34 శాతం) పెంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నారు. కానీ ఈ రిజర్వేషన్లపై బిర్రు ప్రతాప రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం, దానిపై విచారణ చేసిన హైకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని చెబుతూ, గతంలో సుప్రీం గైడ్‌లైన్స్‌ని గుర్తు చేస్తూ తీర్పు ఇచ్చింది.

 

ఈ క్రమంలోనే హైకోర్టులో కేసు వేసింది టీడీపీ వ్యక్తేనని, చంద్రబాబు బీసీలకు ద్రోహం చేశారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తే, జగన్ బీసీల వెన్నెముక విరిచేశారని, ప్రతాప రెడ్డి వైసీపీ మనిషేనని టీడీపీ విమర్శలు చేసింది. వీరి విమర్శలు ఇలా కొనసాగుతుండగానే, ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లని తగ్గించుకుని, ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమైంది. అటు బీసీలకు అన్యాయం జరగడానికి వీల్లేదని చెబుతూ, టీడీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్ సుప్రీం విచారణకు స్వీకరించి, దానిపై ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయం ఆసక్తికరంగా ఉంది.

 

అయితే ఈ కోర్టులు, గొడవలు పక్కనబెడితే...ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల్లో 24 శాతం మందికి బీసీలకు సీట్లు ఇవ్వాలి. అయితే 34 శాతం కోసమని రెండు పార్టీలు పోట్లాడుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రెండు పార్టీల అధినేతలు జగన్, చంద్రబాబులు కలిసి, స్థానిక పోరులో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 34 శాతం సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటిస్తే చాలా బెటర్‌గా ఉంటుందేమో.

 

ఓసీ స్థానాల్లో ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి, అలా కొన్ని చోట్ల బీసీలకు అవకాశం ఇస్తే ఇద్దరు నేతలు బీసీలకు న్యాయం చేసినవారు అవుతారు. బీసీలు అధికంగా ఉన్నచోట ఓసీ రిజర్వేషన్ వస్తే, అక్కడ బీసీ అభ్యర్ధులనే పోటీకి దించితే బాగుంటుంది. కాబట్టి రిజర్వేషన్లపై రెండు పార్టీలు రాజకీయం చేయకుండా, ఆ పని చేస్తే ఉపయోగం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: