ఏపీలో స్థానిక పోరుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ స్థానిక ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టేందుకు అధికార వైసీపీ సిద్ధమైంది. అటు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి, 23 సీట్లు తెచ్చుకుని పరువు పోగొట్టుకున్న టీడీపీ, ఈ స్థానికంలో అయిన సత్తా చాటాలని అనుకుంటుంది. ఇప్పటికే వైసీపీ గెలుపు కోసం వ్యూహాలు రచించేసుకుని పోరుకు సిద్ధంగా ఉంది. సీఎం జగన్ స్థానిక పోరులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు కూడా చేశారు.

 

అయితే చంద్రబాబు కూడా టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. స్థానికం బరిలో దిగే అభ్యర్ధులని ఖరారు చేయాలని నేతలకు సూచించారు. కాకపోతే పోటీకి దిగడానికి తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నట్లు తెలుస్తోంది. పోటీకి దిగిన తమని ఏదొరకంగా వైసీపీ శ్రేణులు ఇబ్బంది పెడతాయని జంకుతున్నారు. పైగా సీఎం జగన్ తాజాగా ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే, అనర్హత వేటు వేసి, మూడేళ్లు జైలులో పెడతామని చెప్పాక తమ్ముళ్ళు ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తున్నారు.

 

ఈ చట్టం తమని ఇబ్బంది పెట్టడానికే తెచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఓట్లు పడటం కష్టమని, ఇదే పని వైసీపీ వాళ్ళు కూడా చేస్తారని, కానీ వాళ్ళకు స్థానిక నేతలు, పోలీసులు కూడా అండగా ఉంటారని అంటున్నారు. కాబట్టి తాము పోటీ చేసిన పెద్ద ఉపయోగం ఉండదని, అలా కాకుండా పోటీకి దూరంగా ఉంటేనే బెటర్ అని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

దీంతో స్థానిక పోరులో వైసీపీకి ఏకగ్రీవాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా జగన్ కూడా మంత్రులకు ఏకగ్రీవాలు మీద దృష్టి పెట్టమని చెప్పారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకుని, జగన్ సరికొత్త రికార్డు సృష్టించేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: