జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల పేరుతో మంత్రులు, ఎంఎల్ఏలను జగన్మోహన్ రెడ్డి బాగానే ఇరికించేశాడు. పార్టీకి అనుకూలంగా 90 శాతం ఫలితాలు రాకపోతే మంత్రులను ఇంటికి పంపించేస్తానని ఇచ్చిన వార్నింగే దీనికి నిదర్శనం. అంటే ఏ జిల్లాలో అయితే ఆశించిన ఫలితాలు రాలేదో ఆ జిల్లాకు చెందిన మంత్రి లేకపోతే ఇన్చార్జి మంత్రి రాజీనామా చేయాల్సుంటుందని జగన్ స్పష్టంగా చెప్పేశాడు. అలాగే మంచి రిజల్ట్స్ చూపని ఎంఎల్ఏలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని కూడా చెప్పేశాడు.

 

సరే జగన్ ఇచ్చిన వార్నింగులు, చేసిన హెచ్చరికలు బాగానే ఉన్నాయి కానీ జనాలు ఓట్లేసేది మంత్రులు, ఎంఎల్ఏలను చూసేనా ? వైసిపికి పడే ఓట్లలో అత్యధికం తనను చూసే వేస్తారన్న విషయం జగన్ కు తెలీదా ? మొన్నటి ఎన్నికల్లో జనాలు వైసిపికి 151 సీట్ల బంపర్ మెజారిటి ఎలాగిచ్చారు ? పోటి చేసిన అభ్యర్ధులను చూశా లేకపోతే జగన్ ను చూశా ?

 

కాబట్టి రేపు కూడా జనాలు ఓట్లేసేది జగన్ పనితీరును చూసే అన్నది వాస్తవం. అయితే ఇక్కడే మరో సమస్య కూడా వస్తుంది. అదేమిటంటే ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావం ఉండకూడదంటూ క్యాబినెట్లో ఓ తీర్మానం కూడా చేయించాడు. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా జనాలు వాటిని చూసి ఓట్లేయరన్న విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. జనాలకు ఎంత చేసినా పోలింగ్ సందర్భంగా డబ్బులు ఇవ్వందే ఓట్లు పడవని అందరికీ తెలుసు.

 

మరి తెలిసి కూడా చట్టంలో జగన్ ఎందుకు మార్పులు చేసినట్లు ? ఎందుకంటే మంత్రులు, ఎంఎల్ఏలను ఇరికించేయటానికే. మందు, డబ్బు ఇవ్వకుండా ఓట్లేయించాలంటే జనాలతో మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు ఎంతో సన్నిహిత సంబంధాలుంటే తప్ప సాధ్యంకాదు. ఇందుకు ముందుగా పార్టీ క్యాడర్ తో బాగా సన్నిహితముండాలి. ఇపుడు పార్టీలో లోపించిందదే అనే ఆరోపణలు బాగా వినబడుతున్నాయి.

 

అంటే మంత్రులు, ఎంఎల్ఏలు ఇపుడు పార్టీ క్యాడర్ చుట్టూ తిరగాల్సిందే. రేపటి ఎన్నికల్లో కూడా జనాలతో బాగా సంబంధమున్న క్యాడర్ నే వెతికి పట్టుకుని పోటి చేయించాలి. పార్టీ క్యాడర్ జగన్ ను కోరుకుంటున్నదిదే. అంటే రేపటి ఎన్నికల్లో తన మనుషులకే మంత్రులు, ఎంఎల్ఏలు టిక్కెట్లిప్పించుకుంటామంటే అందుకు క్యాడర్ ఒప్పుకోదు. మొత్తానికి మంత్రులు, ఎంఎల్ఏల పరితీరుకు పరీక్షపెట్టి జగన్ బాగానే ఇరికించేసినట్లు పార్టీ క్యాడర్ లో చర్చ జరుగుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: