ఇన్ని రోజులూ రాష్ట్ర విభజన అంశం గురించి రెండు కళ్ల సిద్ధాంతాన్ని చెబుతూ వచ్చిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ఢిల్లీ కి ప్రయాణం అవుతున్నాడు. అదికూడా రాష్ట్ర విభజన అంశం గురించి చర్చించడానికే! ఈ సారి చంద్రబాబు కాస్తంత స్పష్టతతో ఢిల్లీనాయకులతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ఉభయ ప్రాంతాలకూ సమ్మతమయ్యే విధంగా రాష్ట్రాన్ని విభజించాలని కోరనున్నాడట. ఈ సోమవారం నాడు చంద్రబాబు ఢిల్లికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. 'ఏపీ హెరాల్డ్' కు అందిన సమాచారం ప్రకారం ఈసారి బాబు వెంట అటు సీమాంధ్ర నాయకులు, ఇటు తెలంగాణ ప్రాంత నాయకలూ ఉంటారట. గతంలో రాష్ట్రపతి ఏపీకి వచ్చినప్పుడు అటు తెలంగాణ వాదులను, ఇటు సమైక్యవాదులను దూరంగా పెట్టి చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ తో సమావేశం అయ్యాడు. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు ఈ సారి ఇరు ప్రాంత నాయకులను కలుపుకొని రాష్ట్రపతి వద్దకు వెళుతున్నాడు. అయితే మొన్నటి వరకూ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు సమైక్యవాదాన్ని వినిపించారు, తెలంగాణ ప్రాంత నేతలు తెలంగాణ వాదాన్ని వినిపించారు. కానీ చంద్రబాబు మాత్రం విభజనకే కట్టుబడి ఉన్నాడని సమాచారం. అయితే సమన్యాయం చేస్తూ , ఆమోదయోగ్యంగా ఉండే విభజనను చేపట్టాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరనున్నాడట. రాష్ట్రాన్ని విడదీయాలంటే సీమాంధ్ర ప్రాంతం వారిని ఒప్పించాలి. సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ వారిని ఒప్పించాలి. ఇందుకు ఉభయ ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడాలి... అని చంద్రబాబు రాష్ట్రపతిని కోరనున్నాడట. కాంగ్రెస్ తన ఇష్టాను సారం నిర్ణయాలు తీసుకొంటూ పోతే కుదరదని బాబు చెబుతాడట. మరి ఈ సారి ఢిల్లీ పర్యటన చంద్రబాబుకు ఎలాంటి ఇమేజ్ ను తెచ్చిపెడుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: