ఏపీ సీఎం జగన్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాయలసీమలో ఉన్న వెనుకపడిన జిల్లాల్లో కడప కూడా ఒకటి. అసలు కడప అని ఏంటి.. రాయల సీమ అంటేనే వెనుకబాటుకు ప్రతిరూపంగా ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్ సీఎం కావడంతో కడప జిల్లాకు మంచిరోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి.

 

 

ఎందుకంటే.. ఇటీవల కడప స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓవైపు దాని ప్రారంభం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతలోనే మరో భారీ పెట్టుబడి కడప జిల్లాకు వచ్చింది. కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్‌ ను కలిశారు. వైయస్సార్‌ జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

 

 

ఇంతకీ ఈ ఐఎంఆర్ కంపెనీ ఎక్కడిది .. దాని పుట్టు పూర్వోత్తరాలేంటి.. అంటే.. ఇది స్విస్ బేస్డ్ కంపెనీ.. ఇప్పటికే ఈ ఐఎంఆర్‌ కంపెనీ ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టింది. అనేక విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుపుతోంది. అంతే కాదు.. ఈ ఐఎంఆర్ కంపెనీ ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకుందట.

 

 

ఐఎంఆర్ కంపెనీ ప్రతిపాదన పట్ల సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఐఎంఆర్‌ కూడా స్టీల్‌ ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ వారితో చెప్పినట్టు తెలిసింది. ఈ రెండు పరిశ్రమలు ప్రారంభమైతే కడప జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: