కర్నూలు జిల్లాలోని నంది కొట్కూరు ఎంఎల్ఏ ఆర్ధర్ రాజీనామా చేయబోతున్నాడా ? ఇపుడిదే అంశం జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లా రాజీకీయాల్లో ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆర్ధర్ గెలిచిన దగ్గర నుండి పార్టీలోనే గొడవలు పెరిగిపోయాయి. నియోజకవర్గంలో కీలక నేత అయిన సిద్దార్ధరెడ్డితో ఎంఎల్ఏకి ఏమాత్రం పడటం లేదు.  ఎంఎల్ఏ ఎడ్డం అంటే రెడ్డి తెడ్డం అంటున్నారు ప్రతి విషయంలోను.

 

ఇదే విషయమై ఈమధ్య ఇన్చార్జి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సమక్షంలోనే పంచాయితీ జరిగినా పెద్ద ఉపయోగం కనబడలేదు. దాంతో విషయం చివరకు జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళింది. ఇద్దరినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేయాలంటూ జగన్ మంత్రిని ఆదేశించాడు. అయితే వీళ్ళద్దరి మధ్య వివాదాలు సర్దుబాటు చేసుకోలేని స్ధాయిని దాటి పోయిందని సమాచారం. అందుకనే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఏ విషయంలో కూడా ఇద్దరూ వెనక్కి తగ్గకపోవటంతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి.

 

వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మన్ తో పాటు పాలక వర్గం నియామకం కూడా వీళ్ళ మధ్య గొడవలతోనే ఆగిపోయింది. ఎంఎల్ఏతో పాటు ప్రతి విషయంలోను సిద్దార్ధరెడ్డి కూడా ముందుకు వస్తుండటంతో ఇక ఇద్దరి కలిసి పనిచేసే పరిస్ధితి లేదని తేలిపోయింది. అందుకనే చివరి అస్త్రంగా ఆర్ధర్ తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. రెడ్డితో పార్టీలో ఇమడలేకపోతున్న కారణంగా తాను ఎంఎల్ఏగా ఉండి కూడా ఉపయోగం లేదని ఆర్ధర్ నిర్దారణకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

మొత్తానికి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం కలిసి కట్టుగా పనిచేసిన నేతలు అధికారంలోకి రాగానే మాత్రం ఆధిపత్య గొడవలతో విడిపోతుండటం విచిత్రంగానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెడ్డి ఎప్పటికీ ఎంఎల్ఏ కాలేడు. ఎందుకంటే నంది కొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఆర్ధర్ కాకపోతే మరో ఎస్సీ ఎంఎల్ఏ అవుతారు. ఈ విషయం తెలుసుకుంటే ఎంఎల్ఏలతో గొడవ లేకుండా సయోధ్య సాధ్యమవుతుంది. లేదంటే చివరకు ఇద్దరినీ జగన్ బయటకు తరిమేయటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: