తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిసారి గవర్నర్ హోదాలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయం దండగ అనే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవని ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా మారుతోందని చెప్పారు. గతంలో తెలంగాణ సంసృతీ సంప్రదాయాలు వివక్షకు గురయ్యాయని వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్కో సమస్యను అధిగమిస్తోందని చెప్పారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఆసరా పెన్షన్లు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని... బీడీ కార్మికులకు 2016 రూపాయలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ప్రశంసించారు. వృద్ధ్యాప్య పెన్షన్ల వయసును 57 ఏళ్లకు తగ్గించామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. 
 
రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడని చెప్పారు. రాష్ట్రాన్ని కేసీఆర్ దార్శనికత ముందుకు నడిపిస్తుందని అన్నారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రం ఎన్నో రంగాలలో పురోగతి సాధించిందని... రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ సంక్షోభాన్ని చవిచూసిందని వ్యాఖ్యానించారు. నాడు రాష్ట్రంలో కనీసం పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పారు. 
 
అన్ని రంగాలకు నాణ్యమైన కరెంటును ఇస్తున్నామని తెలిపారు. రైతులకు సకాలంలో సబ్సిడీపై పురుగు మందులు, ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. తక్కువ కాలంలోనే తెలంగాణ కేసీఆర్ కృషితో ప్రగతి పథంలో నడుస్తోందని అన్నారు. కేసీఆర్ పక్కా ప్రణాళికతో సమస్యలను అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ నెల 8వ తేదీన మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రిలో హోదాలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు.                      

మరింత సమాచారం తెలుసుకోండి: