ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలతో పాటు మరికొందరికి ప్రమోషన్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం ఈరోజు బదిలీ, ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్‌ కే మీనా అదనపు డీజీగా, శ్రీకాంత్ ను ఎస్‌ఐబీ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి, మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్‌, ప్రొవిజినల్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీగా కేవీ మోహన్‌ రావు, ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్ పదోన్నతి పొందారు. 
 
వీరితో పాటు మరికొందరు పదోన్నతి పొందారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌, ఏపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా హరీష్‌కుమార్‌ గుప్తా, నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్‌, ఏపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి. క్రిష్ణారావు, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి బదిలీ అయ్యారు. ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. 
 
ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో హైకోర్టు సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. ప్రభుత్వం దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ కు ప్రభుత్వం తుది జాబితాను పంపించనుంది. 
 
ఈసీ ఇప్పటికే ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని... బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ పూర్తి కానుందని తెలిపింది. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మొదట వేటిని నిర్వహించాలనే దానిపై స్పష్టత వస్తుందని చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: