భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకూ సుమారు 6 లక్షల మందికి పైగా స్క్రీనింగ్‌ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించింది. మరికొన్ని సంస్థలు తగిన భద్రతా చర్యలు చేపట్టాయి. 

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ కరోనా అనుమానితులు, బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధవారం వరకూ 29 కేసులు నమోదవగా.. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మరో వ్యక్తి కరోనాతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30కి చేరింది. వీరిలో 16 మంది విదేశీయులున్నారు.

 

దేశవ్యాప్తంగా 21 ఎయిర్‌పోర్టుల్లో కరోనా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ 6లక్షల మంది ప్రయాణికులను స్క్రీనింగ్ చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ప్రధాని మోదీ ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.  ప్రస్తుతం పుణెలో ల్యాబ్‌లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి తీవ్రత నేపథ్యంలో మరో 15 ల్యాబ్‌లు 19 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. కొన్ని దేశాలకు వీసా-ఆన్‌-అరైవల్‌ సదుపాయాన్ని ప్రభుత్వం నిలిపేసింది. 

 

 కరోనా సోకిన ఇటలీ పర్యాటకులను ఢిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాధి సోకినట్లు తేలగానే వీరందరినీ దిల్లీలోని ఐటీబీపీ  కేంద్రంలో ఉంచి చికిత్స అందించారు. తాజాగా వారందరికీ 'మెడాంటా' ఆసుపత్రిలో చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 'క్వారంటైన్‌ ఫ్లోర్‌' ఏర్పాటుచేశారు. 
కరోనా కారణంగా బెల్జియంలో జరగాల్సిన 'భారత్‌-యురోపియన్‌ యూనియన్‌ సదస్సు' వాయిదా పడింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రద్దయింది. 

 

 కరోనా వైరస్‌ విస్తరించకుండా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు దిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. అంతేకాక.. బయో మెట్రిక్‌ హాజరును మినహాయించాలని సూచించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విద్యార్థులందరూ మాస్కులు ధరించాలని సీబీఎస్‌ఈ సూచించింది. బోర్డ్ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

 

లక్నోలో మాంసం అమ్మే దుకాణాలను మూసేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ వద్ద అప్రమత్తమయ్యారు అధికారులు. పర్యాటకులకు థర్మల్‌ గన్‌లతో స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.  దుబాయ్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థికి కరోనా సోకినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థిని, అతడి కుటుంబ సభ్యులను ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతడు చదువుతున్న పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: