తమిళనాడుకు తాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్  సూత్రప్రాయంగా అంగీకరించారు. ఏపీ జగన్‌ను కలిసొచ్చాక తనతో భేటీ అయిన తమిళనాడు మంత్రులకు... ఈ మేరకు హామీ ఇచ్చారు. తమ సమక్షంలోనే కేసీఆర్ ఫోన్‌లో జగన్‌తో మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరిద్దామని చెప్పడంతో... తమిళ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు.

 

తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమిళనాడు... వేసవి ప్రారంభంలోనే మంచినీళ్ల కోసం తెలుగు రాష్ట్రాలను ఆశ్రయించింది. ఆ రాష్ట్ర పురపాలక గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి... మత్స్య, పాలనా సంస్కరణల శాఖ మంత్రి జయకుమార్‍ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తెలుగుగంగ ద్వారా చెన్నైకి తాగు నీరు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో పాటు... నదుల అనుసంధానంపై జగన్‌తో చర్చించారు. 

 

జగన్‌తో భేటీ తర్వాత నేరుగా హైదరాబాద్‌ వచ్చిన తమిళ మంత్రులు... ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి తాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఏపీ సీఎంతో కూడా మాట్లాడాల్సి ఉన్నందున... తమిళనాడు ముఖ్యమంత్రి ద్వారా తెలుగు రాష్ట్రాలకు అధికారికంగా లేఖలు రాయాలని కేసీఆర్‌ వారికి సూచించారు. ఆ తర్వాత మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి... అందులో చర్చించిన అంశాల ఆధారంగా నివేదిక రూపొందించాలని... ఏకాభిప్రాయం వచ్చాక తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

 

తమిళనాడు ప్రతినిధుల బృందం సమక్షంలోనే ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. తాగునీటి విడుదలపై తాను చేసిన సూచనలను వివరించారు. తమిళనాడు తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆ రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు. తమిళనాడు తాగునీటి అవసరాలను దేశం మొత్తం అర్థం చేసుకున్నప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, నిజమైన భారతీయుడిగా పొరుగు రాష్ట్ర సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. 

 

తాగునీటి సమస్య విషయంలో పొరుగు రాష్ట్రాలు బాధిత రాష్ట్రం పట్ల ఉదారంగా వ్యవహరించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గతంలో ఇదే విషయాన్ని తాను నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావించానని, తాగునీటి విషయంలో తమిళనాడు ఎదుర్కొంటున్న సమస్యపై దేశం మొత్తం సిగ్గుపడాలన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, సాగునీటికి కేవలం 30 వేల టీఎంసీలు మాత్రమే అవసరమవుతాయని, మరో 10 వేల టీఎంసీలతో దేశ తాగునీటి అవసరాలు తీర్చవచ్చని కేసీఆర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా నీటి సమస్య లేకుండా... ఆ దిశగా ఇప్పటికైనా ముందడుగు పడాలన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: