జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి అంతా యాక్టివ్ గా కనిపించడంలేదు. తాను తీసుకున్న నిర్ణయాలకు బీజేపీ తరచుగా అడ్డుతగులుతూ, తమ రాజకీయ ప్రత్యర్ధులకు అండగా నిలుస్తూ ఉండటంపై చాలా కాలంగా పవన్ తో పాటు ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉంటూ వస్తున్నారు. ఒక దశలో బిజెపి జనసేన పార్టీల మధ్య పొత్తు తెగ తెంపులు అవుతాయని, విడిగానే రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని, ప్రచారం జరిగింది. అలాగే ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో జనసేన జతకట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయినా ఏ విషయంపైన పవన్ తన స్పందన  తెలియజేయలేదు. 

IHG


అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత ప్రజా ఉద్యమాలు, ఆందోళనలకు పూర్తి సమయం కేటాయిద్దామన్నా బీజేపీ అడుగడుగునా అడ్డం పడుతూ వచ్చింది. దీనిపైన జనసేన వర్గాల్లో తీవ్ర ఆందోళనలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, ఈ రోజు పవన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవబోతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ శాలతో పవన్ భేటీ అవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై క్షుణ్ణంగా పవన్ వారితో  చర్చించడంతో పాటు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయం లో బిజెపి అవలంభిస్తున్న వైఖరిని కూడా పవన్ ఎత్తి చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పవన్ బిజెపి దగ్గర కొన్ని డిమాండ్లు పవన్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా వైసీపీ విషయంలో బిజెపి అవలంభిస్తున్న వైఖరి తో జనసేన పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా అవకాశం కనిపిస్తోంది. అలాగే వైసిపి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే విషయంలోనూ, ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు చేసే విషయంలోనూ జనసేన నిర్ణయాలకు బిజెపి అడ్డం పడకుండా పవన్ ఈరోజు జరిగే చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన తర్వాత ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: