ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వాలు సాయశక్తులా పయత్నించి, విఫలమౌతున్నాయి. మరోవైపు కరోనా బాధితులు, అంతకంతకూ పెరిగి పోతుండటం, చాలా కలవరానికి గురి చేస్తోంది. ఇక కరోనా వైరస్ సోకిన వారు మృత్యువు ఎటువైపు నుంచి తరుముకొస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. కాగా ఈ మహమ్మారి చైనాలోని వూహాన్‌లో బయటపడ్డ విషయం అందరికి విదితమే.

 

తాజాగా అదే ప్రాంతంలో ఓ కరోనా బాధితుడు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటో అందరి మనసులను దహించి వేస్తోంది. వివరాల్లోకి వెళితే.. 87ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో పిబ్రవరి నెలలో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన అనంతరం, అతనికి పాజిటివ్‌ అని తేలడంతో అప్పటినుంచి హాస్పిటల్‌లోనే ఖైదీ అయిపోయాడు. అయితే అతన్ని పరీక్షించే వైద్యుడు రోగిని సిటీస్కాన్‌ కోసం తీసుకెళుతూ ఏదో తట్టినవాడిలా ఒక్కసారిగా ఆగిపోయాడు. 

 

రోగివైపు తిరిగి ‘సూర్యాస్తమయం చూస్తావా?’ అని అడిగాడు. వెంటనే అతను సంతోషంతో ‘తప్పకుండా చూస్తా’నని చెప్పడంతో.. పూర్తి నిర్మానుష్యంగా ఉన్న ఆసుపత్రి వెలుపలి భాగానికి అతన్ని తీసుకెళ్లాడు.  నిర్మలంగా, వెలుగులు వెదజల్లుతూ అస్తమిస్తోన్న ఎర్రని సూర్యుడిని, హాయిగా పలకరిస్తున్న ప్రకృతిని.. రోగి, అతన్ని కాపాడేందుకు యత్నిస్తున్న వైద్యున్ని తనివితీరా ఆస్వాదించాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 

 

అయితే అతని జీవితం అస్తమించకూడదని, సూర్యోదయంలా మరింత ప్రకాశవంతంగా మారాలని నెటిజన్లు కాంక్షిస్తూ.. అతనికి దీవెనలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు 85 దేశాల్లో సంక్రమించిన ఈ వ్యాధి వలన 3345 మంది చనిపోయిన విషయం మనకు విదితమే. ఒక్క చైనాలోనే 80వేలకు పైగా కేసులు నమోదు కావడం వలన పరిస్థితి తీవ్రత ఏ మేరకు వున్నదో మనం అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: