2019 ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీకి దిగిన విషయం తెలిసిందే. టీడీపీ, వైసీపీల నుంచి రాజకీయ వారసులు ఎక్కువగానే అరంగ్రేటం చేశారు. ఈ నేపథ్యంలోనే మార్కాపురం నుంచి కూడా ఓ రాజకీయ వారసుడు తొలిసారి ఎన్నికల బరిలో దిగాడు. మార్కాపురం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కే‌పి కొండారెడ్డి తనయుడు నాగార్జున రెడ్డి, 2019లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 

అమెరికాలో ఎం‌ఎస్ చదివచ్చిన నాగార్జున...మార్కాపురం వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. తండ్రి కొండారెడ్డి సపోర్ట్‌ ఉండటంతో తొలిసారి పోటీలోకి దిగిన నాగార్జున, టీడీపీ సీనియర్ నేత కందుల నారాయణరెడ్డిపై 18 వేల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే కావడం, పైగా రాజకీయాలకు కొత్త కావడం వల్ల నాగార్జున కాస్త స్లోగానే ఉన్నారు. సమయం బట్టి నియోజకవర్గ ప్రజలని కలుసుకుంటున్నారు. ఎక్కువ శాతం నియోజకవర్గంలో పనులు కుటుంబ సభ్యులే చూసుకుంటున్నారు.

 

నాగార్జున తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డికి రాజకీయాల్లో కాస్త అనుభవం ఉండటం, అటు ఈయన మామ మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసుల రెడ్డి సపోర్ట్‌ కూడా ఉండటంతో నాగార్జున అలా అలా ముందుకెళ్లిపోతున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు ఎలాగో అమలువుతున్నాయి. అయితే నియోజకవర్గంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయితే మార్కాపురంలో నీటి సమస్యలు ఉండవు. సీఎం జగన్ ఆ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడానికి చూస్తున్న సంగతి తెలిసిందే.

 

అటు నియోజకవర్గంలో అభివృద్ధి కూడా అంతంత మాత్రమే జరుగుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులు మార్కాపురం నియోజకవర్గంలో పెద్దగా నడవడంలేదు. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ట, పొదిలి మండలాలలో గ్రామ సచివాలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులను రూ.13 కోట్లు కేటాయించగా, ఈ నిధులలో ఇప్పటికి ఒక్క రూపాయ కూడా ఖర్చు కాలేదని తెలుస్తోంది.

 

అలాగే సి‌సి రోడ్లు, డ్రైన్లు పనులు కూడా కదలడం లేదు. అయితే నాగార్జునకు కాస్త అనుభవం లేకపోవడం వల్ల ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే నిదానంగా అధికారుల సపోర్ట్‌తో పనులు చేయించడానికి నాగార్జున సిద్ధమైనట్లు సమాచారం. ఏదేమైనా ఈ కొత్త ఎమ్మెల్యే కాస్త స్పీడ్ పెంచాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: