ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార వైసిపిలో నేతల మధ్య విభేదాలు పార్టీ.. అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. కీలకమైన గుంటూరు.. పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాలో మంత్రులు.. ఎమ్మెల్యేల మధ్య స‌ఖ్య‌త‌ లేదు. ఇక గత ఎన్నికల్లో వైసిపి టోటల్ గా క్లీన్ స్వీప్ చేసిన కర్నూలు జిల్లాలో దాదాపు ఐదు నియోజకవర్గాల్లో నేతల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇక గత ఎనిమిది నెలలుగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయ వాతావరణం నడుస్తోంది.

 

ఇక తాజాగా ఏఎంసీ చైర్మ‌న్ విష‌యంలో కూడా ఏర్ప‌డిన విబేధాలు ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్‌న‌కు మ‌రింత కార‌ణ‌మ‌య్యాయి. దీనిపై ఆర్థ‌ర్ బైరెడ్డితో పాటు మంత్రి అనిల్ కుమార్‌పై తీవ్రంగా విరుచుకు ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్రెస్‌మీట్ పెట్టిన ఆర్థ‌ర్ త‌న ఆవేద‌న ప‌రోక్షంగా వెళ్ల‌క‌క్కారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ పదవులు మాకు రానందుకు బాధ లేద‌ని.. నా అనుచ‌రుల‌కు ప‌ద‌వులు రాక‌పోయినా బాధ లేద‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి లేని పాల‌న అందిస్తున్నామ‌ని చెప్పారు.

 

స్థానిక ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని మెజార్టీతో గెలిచి సీఎం జ‌గ‌న్‌కు కానుక‌గా ఇస్తామ‌ని చెప్పారు. ఇక సిద్ధార్థ‌రెడ్డితో త‌న‌కు విబేధాలు లేవ‌ని చెప్పినా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌ట్లో గ్యాప్ త‌గ్గేలా లేదు. ఇక మార్కెట్ క‌మిటీ గౌర‌వ చైర్మన్‌గా ఉన్న త‌న‌కు క‌మిటీ ప్రమాణ స్వీకారం గురించి సమాచారం ఇవ్వలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏదేమైనా ఈ కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వార్ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి కంటిన్యూ అవుతోంది. ఇద్ద‌రు నేత‌ల్లో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేదు. మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే పార్టీకి పెద్ద మైన‌స్ అవ్వ‌డంతో పాటు అధిష్టానానికి కూడా త‌ల‌నొప్పిగా మార‌నుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: