ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో రాజకీయం రంజుగా మారింది. నిన్న‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న రాజకీయం కాస్తా ఇప్పుడు ఒక్క‌సారిగా వేడెక్కింది. సీఎం జ‌గ‌న్ త‌న స‌త్తా చాటేందుకు స్థానిక సంస్థ‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించాల‌ని ఇప్ప‌టికే మంత్రులు, ఎమ్మెల్యేల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ క్ర‌మంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికలకు అధికార పార్టీ సన్నాహాలు.. ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న సమయంలో వైసీపీకి తిరుగులేని బ‌లం ఉన్న క‌ర్నూలు జిల్లాలో ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది.

 

కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఒకరిద్దరు కాదు ఒకేసారి మూడు వందల మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి జంప్ అయ్యారు. వీళ్లంతా వైసీపీలో కీల‌క నేత‌లుగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో కోడుమూరులో వైసీపీ గెలుపు కోసం క‌ష్ట‌ప‌డి అక్క‌డ పార్టీ అభ్య‌ర్థి భారీ మెజార్టీతో గెలిచేందుకు క‌ష్ట‌ప‌డ్డారు. వీరంతా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ తీరుతో తీవ్రంగా విబేధించి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో వారంతా పసుపు కండువాలు కప్పుకున్నారు.

 

కోడుమూరు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డికి సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ ఆయ‌న కుటుంబానికి పార్టీల‌తో సంబంధం లేకుండా మంచి ప‌ట్టు ఉంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ అసంతృప్తుల‌ను ఆయ‌న త‌న వైపున‌కు తిప్పుకుని టీడీపీలో చేరేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ఇలాంటి పరిణామం జరగడం వైసీపీకి ఎదురుదెబ్బేనని స్థానిక నేతలు చెబుతున్నారు. క‌ర్నూలు జిల్లాలో ఇప్ప‌టికే ఆరేడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అస‌మ్మ‌తి నేత‌ల‌తో జ‌గ‌న్ విసిగిపోయి ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ పార్టీ నేత‌లు టీడీపీలోకి వెళ్లిన విష‌యం తెలిస్తే త‌మ‌కు అక్షింతలు త‌ప్ప‌వ‌న్న ఆందోళ‌న కూడా ఆ జిల్లా నేత‌ల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: