శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ యువనేత పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆత్మత్యాహత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కుమారుడు అవినాష్ వైసీపీ తనపై అక్రమ కేసులు బనాయిస్తోందంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
భవనం పై నుండి దూకిన అవినాష్ కారు మీద పడటంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. పోలీసులు అతనిని సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అవినాష్ ను శివాలయం వివాదం విషయంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎస్‌ఎం పురంలోని శివాలయం విషయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శివాలయం ప్రారంభోత్సవం విషయంలో వివాదం నెలకొనడంతో నాలుగు నెలలుగా ఈ గుడి ప్రారంభోత్సవం జరగలేదు. 
 
రెండు పార్టీల మధ్య గుడి విషయంలో తరచుగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులు తరచుగా అవినాష్ ను స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. పోలీసులు అవినాష్ ను వివాదానికి బాధ్యుడిని చేస్తూ కేసులు పెట్టారు. ఎస్సై రాజేష్ తరచూ తనను స్టేషన్ కు పిలిపించి విచారిస్తూ ఉండటంతో అవినాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈరోజు కూడా పోలీసులు అతనిని విచారణ కోసం పిలిపించారు. 
 
స్టేషన్ కు వెళ్లిన తరువాత అవినాష్ పీఎస్ రెండో అంతస్థు పైకి ఎక్కి భవనం నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అవినాష్ కు చికిత్స కొనసాగుతుంది. గతంలో అవినాష్ ఎస్.ఎం పురం సర్పంచ్ గా కూడా పని చేశారు. టీడీపీ నేతలు పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేధింపులు పెరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: