భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మలేషియా, థాయిలాండ్ దేశాలలో పర్యటించి భారత్ కు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో కరోనా కేసుల సంఖ్య 31కి చేరింది. తెలంగాణలో వేరే దేశం నుండి వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది. ఈరోజు సీఎం జగన్ అధికారులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్ష జరిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఆధికారులు పాల్గొన్నారు. జగన్ అధికారులకు కరోనా విషయంలో ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దని చెప్పారు. 
 
కరోనాపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా వైరస్ నిరోధంలో గ్రామ సచివాలయాలను భాగస్వాములుగా చేసుకోవాలని చెప్పారు. కరోనా కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆదేశించారు. అధికారులు జగన్ కు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి వివరించారు. విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. 
 
విజయవాడ, అనంతపురంలలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని జగన్ సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వైద్య శాఖ అధికారులు రాష్ట్రంలో ఇప్పటివరకు 24 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయని ఈ కేసుల్లో 20 నెగిటివ్ వచ్చాయని, మిగతా కేసులకు సంబంధించిన నివేదిక అందాల్సి ఉందని చెప్పారు.             

మరింత సమాచారం తెలుసుకోండి: