ఏపీ మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించారు.  ఈ సంద‌ర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో క‌లిసి ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రిజర్వేషన్లపై నోటిఫికేషన్ జారీ అయ్యిందని తెలిపారు. రేపో, ఎల్లుండో స్థానికసంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంద‌ని బొత్స వెల్ల‌డించారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఈనెల 30వ తేదీలోగా స్థానికసంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు వృధా కాకూడదని, అభివృధ్ధికి ఎటువంటి ఆటంకం ఏర్పడకూడదని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

 

`` వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు గత రెండున్నర నెలల కిందటే జరపాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు యాబై తొమ్మిది శాతాన్ని జనాభా ప్రాతిపదికన కల్పించాలని కేబినెట్ లో కూడా నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం జిఓలు కూడా విడుదల చేశాం. ఎన్నికల కమిషన్ కు కూడా ఆ జీఓలను పంపించి దాని ప్రకారం ఎన్నికలు జరపాలని కోరాం. ఈ నేపథ్యంలో బిసిలకు 34శాతం వరకు రిజర్వేషన్లు అందుతాయని, వారు బలపడతారని, బాగుపడతారని మా ప్రభుత్వం భావించింది. కానీ అలా జరగకూడదని దుర్భుద్ది, దురుద్దేశంతో టిడిపికి చెందిన నాయకులతో చంద్రబాబు రిజర్వేషన్లపై కోర్ట్ లో పిటీషన్లు వేయించారు.రెండున్నర నెలల కిందట జరగాల్సిన ఈ ఎన్నికలను జరగనివ్వకుండా అడ్డుకున్నారు.  `` అని బొత్స మండిప‌డ్డారు.

 

``59 శాతం బిసిలకు రిజర్వేషన్లు దక్కకుండా, కేవలం 50 శాతం వరకే వుండాలంటూ సుప్రీం కోర్ట్ ను టిడిపి నాయకులు ఆశ్రయించారు. జనాభా ప్రాతిపాదిక మీద రిజర్వేషన్లు వుండాలని, అందరికీ సమన్యాయం జరగాలని సీఎం జగన్ మా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కోర్టులో టిడిపి వారు వేసిన పిటీషన్లపై ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. దానివల్ల ఎన్నికల నిర్వహణకు ఆలస్యం జరిగింది. చివరికి ఎన్నికలకు స్టే ఇవ్వము అని కోర్ట్ చేబితే, టిడిపి నాయకులు సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సుప్రీం ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని, ఎన్నికలపై స్టే ఇవ్వాలని పిటీషన్లు వేశారు.  సుప్రీంకోర్టు దీనిపై హైకోర్ట్ కు విచారణకు పంపించిన విషయం రాష్ట్రప్రజలకు తెలుసు``అని వెల్ల‌డించారు. 

 

``ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు మార్కెట్ కమిటీ చైర్మన్ లను ఇచ్చిన సందర్భంలో కొద్దిశాతమే వారికి పదవులు దక్కేవి.ఈ రోజు సీఎం జగన్ నిర్ణయంతో యాబైశాతం ఎస్పీ, ఎస్టీ, బిసిలకు న్యాయంగా పదవులు దక్కాయి. దేవాదాయకమిటీలు, కార్పోరేషన్ చైర్మన్ లు, రాష్ట్రంలోని యూనివర్సిటీ విసి, పాలకవర్గాలు, న్యాయ విభాగంలోని నియామకాల్లోనూ యాబైశాతం ఇచ్చాం.ఇది ఒక చరిత్ర. జగన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. భవిష్యత్తులో ఎవరూ దీనిని మార్చలేరు. సుప్రీం తీర్పు ప్రకారం యాబైశాతం వున్నప్పటికికూడా బిసిలకు న్యాయం చేయడానికి ఎక్కువ శాతం కావాలని ఈ ప్రభుత్వం ప్రయత్నించింది.కానీ దీనిని అడ్డుకునేందుకు టిడిపి నాయకులు కుట్రలు చేశారు.బలహీనవర్గాల పట్ల టిడిపి నాయకులకు వున్న చిన్నచూపు, ఏహ్యభావంకు ఇది నిదర్శనం.ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు స్వయంగా అన్న మాటలు ప్రజలకు గుర్తున్నాయి. జగన్ బిసిలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. వెనుక గోతులు తీస్తూ, ముందు మరోలా మాట్లాడుతున్న టిడిపి నాయకుల వైఖరిని ప్రజలు గమనించాలి.`` అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: