అమరావతి అన్నది చంద్రబాబు కలల రాజధాని. ఆయన కలలను అయిదు కోట్ల జనం అర్ధం చేసుకోలేక ఆయన్ని ఓడించారు. బాబు మాదిరిగానే వారు కూడా మల్టీ కలర్ కలలు కంటే మళ్లీ ఆయనే సీఎం అయ్యేవారు. బాబు కలల రాజధాని వరల్డ్ లో నంబర్ వన్ గా  ఉంటుంది. అక్కడ నవ నగరాలు ఉంటాయి. 53 వేల ఎకరాల  అంత పెద్ద రాజధాని నగరం మనకెందుకు లేదు అని ప్రపంచం అంతా నివ్వెరపోయి చూసేది. ఇంకో మాట చెప్పాలంటే పైన స్వర్గాన  అమరావతిలో ఉన్న ఇంద్రుడు సైతం బాబు అమరావతిని చూసి అసూయ పడేవాడు. పైగా స్వాధీనం చేసుకునేందుకు యుధ్ధానికి కూడా దిగేవాడు.

 

అంతటి అమరావతి కట్టడానికి బాబు ఎంత కాలం పడుతుంది, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయన్నది మాత్రం వూహించలేదులా ఉంది. అందుకే ఆయన రాజధాని అలా కలల్లోనే ఉండిపోయింది. ఇలలోకి దిగిరాలేదు. సరే బాబుని విపక్షంలో కూర్చోబెట్టారు. కనీసం ప్రతిపక్ష నేతగా అయినా అమరావతి పేరును తలచుకుని అయిదేళ్ళూ వెళ్ళదీయాలనుకుంటే జగన్ అక్కడే గురి చూసి మరీ బ్రేకులేశారు.

 

అంతటితో ఆగకుండా మూడు రాజధానుల  ప్రతిపాదనలు తెచ్చారు. పేరుకు అమరావతిలో శాసనసభా రాజధాని ఉంచుతామని అన్నారు కానీ అది ఎన్నాళ్ళ ముచ్చటో కూడా తెలియదు. మొత్తానికి  బాబుకు బాగా బోధపడిన సంగతేంటంటే అమరావతి ఉత్త రాజధాని మాత్రమేనని. అందుకే ఆయన చేయాల్సిన ఆందోళనలు అన్నీ చేస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు అమరావతి అన్న పేరు ఎక్కడా అధికారికంగా కూడా రాకుండా వైసీపీ సర్కార్ జాగ్రత్తపడుతోందట. జగన్ సీఎంగా సమీక్షలు అన్నీ కూడా తాడేపల్లిలోని  తన క్యాంప్ ఆఫీసులో నిర్వహిస్తారు. దాంతో అక్కడ జరిగే సమావేశాల వివ‌రాలను తాడేపల్లి పేరిట ప్రెస్ రిలీజ్ చేస్తున్నారుట.

 

మరోవైపు సచివాలయం లో జరిగే మీటింగులన్నీ కూడా వెలగపూడి పేరు మీద మీడియాకు వస్తున్నాయట. ఈ మొత్తం తతంగంలో ఎక్కడా అమరావతి అన్న పేరు మచ్చుకైనా రావడంలేదుట. జగన్ ఇంకా అక్కడ ఉండగానే అమరావతి పేరు ఇలా కనిపించకపోతే రేపు ఆయన నిజంగా విశాఖ రాజధాని చేసుకుంటే ఆ పేరు ఎవరికైనా గుర్తు ఉంటుందా అన్నదే పెద్ద డౌట్. మొత్తానికి బాబుని  కూడా అమరావతి  మరచిపోయేలా చేస్తున్నాడు జగన్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: