ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఉగాది పండగ రోజున రాష్ట్రంలో 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇళ్లు లేని, అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనుంది. ఈరోజు జగన్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ స్కీమ్ గురించి చర్చించడానికి అధికారులతో సమావేశమయ్యారు. 
 
జగన్ ఈ సమావేశంలో ప్రధానంగా పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలలో ఇళ్ల నిర్మాణం గురించి చర్చించారు. అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి మంజూరైన ఇళ్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జగన్ నిరుపేదల కోసం రాబోయే నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నట్లు అధికారులకు తెలిపారు. ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చే వారితో పాటు సొంత ఇళ్ల స్థలాలు ఉన్నవారికి కూడా ఇళ్లను నిర్మించనుంది. 
 
ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన సిబ్బందిలో 45,000 మంది సేవలను 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకోనుంది. అధికారులు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం గురించి ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది. జగన్ అధికారులకు ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని సూచించారు. కిచెన్, బెడ్ రూం, వరండా, టాయిలెట్ ఉండేలా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. 
 
సీఎం అధికారులకు ఇళ్ల నిర్మాణం పూర్తయిన తరువాత బ్యాంకులు పావలా వడ్డీకే ఇళ్లపై రుణాలు పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మిగిలిన వడ్డీని భరిస్తుందని సీఎం తెలిపారు. పేద ప్రజలు అప్పు కోసం అధిక వడ్డీలకు రుణాలు తీసుకునే పరిస్థితి రాకూడదని చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరిగే కాలనీల్లో తాగునీరు, కరెంట్, ఇతర సౌకర్యాలను కల్పించాలని అధికారులకు జగన్ సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: