వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం సుప‌రిచిత‌మే. ఆయ‌న త‌న స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. తాగునీరు, విద్యార్థుల‌కు పుస్త‌కాలు వంటివి పంపిణీ చేయ‌డంతోపాటు వెనుబ‌డిన ప్రాంతాల్లోని పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే నిమిత్తం.. ఆయ‌న స్కాల‌ర్ షిప్పుల‌ను కూడా అందిస్తూ.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీకి తొలుత మ‌ద్ద‌తు దారుగా ఉన్న ఆయ‌న 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్ ఆశించారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న పార్టీ త‌రఫున ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. బాబు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను క్షేత్ర‌స్థాయికి తీసుకువెళ్లి వివ‌రించారు.



ఇలా పార్టీ కార్య‌క్ర‌మాల‌తో పాటు టీడీపీ శ్రేణుల‌కు కూడా వేగేశ్న చేరువ‌య్యారు. దీంతో ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌న‌ను గుర్తిస్తార‌ని అనుకున్నారు వేగేశ్న‌. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు విరాళాలు కూడా ఇచ్చారు. త‌న సొంత నిధుల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే టికెట్ రేసులో త‌న‌ను ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు గుర్తిస్తార‌ని అనుకున్నారు. అయితే, పార్టీలో కీల‌కంగా ఉన్న సుజ‌నా చౌద‌రి శిష్యుడు, ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ పోటీని మాత్రం నిలువ‌రించ‌లేక పోయారు. దీంతో చంద్ర‌బాబు వేగేశ్న‌కు ఇవ్వాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టి ఎమ్మెల్సీగా ఉన్న స‌తీష్‌కే మ‌ళ్లీ టికెట్ ఇచ్చారు. అయితే, ఈయ‌న జ‌గ‌న్ సునామీ ప్ర‌భావంతో ఓడిపోవ‌డం , అనంతరం సుజ‌నా బీజేపీతీర్థం పుచ్చుకోవ‌డంతో ఆయ‌న వెంట వెళ్లి సైకిల్ దిగిపోవ‌డం తెలిసిందే.



దీంతో బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఇంచార్జ్ లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వేగేశ్న‌కు చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించారు. ఈ ప‌ద‌వి కోసం మ‌రి కొంద‌రు నేత‌లు కూడా పోటీ ప‌డ్డారు. అయితే చంద్ర‌బాబు మాత్రం ఈ సారి పార్టీ కోసం గ‌త ఎన్నిక‌ల‌కు రెండున్న‌రేళ్ల ముందునుంచి అహ‌ర్నిశం క‌ష్ట‌ప‌డ‌డంతో పాటు బాప‌ట్ల‌లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ మొక్కోవ‌ని పోరాటం చేస్తోన్న న‌రేంద్ర వ‌ర్మ‌కే ఇన్‌చార్జ్ ప‌ట్టం క‌ట్టారు. వాస్త‌వానికి ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ పద‌వి ఇవ్వ‌క ముందు నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. అన్నం స‌తీష్ పార్టీ నుంచి వెళ్లిపోయాక అనాథ‌గా మారిన బాప‌ట్ల టీడీపీని త‌న భుజ‌స్కంధాల మీద వేసుకున్నారు.



అప్ప‌టి నుంచే బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని వ‌ర్మ ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. నాలుగు సంవ‌త్స‌రాల పాటు పార్టీ కోసం సొంతంగా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చ చేసిన న‌రేంద్ర‌వ‌ర్మ క‌ష్టానికి ఇప్పుడు ఫ‌లితం రావ‌డంతో బాప‌ట్ల టీడీపీ శ్రేణుల్లో ఎక్క‌డా లేని జోష్ నెల‌కొంది.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తిని ఢీ కొట్టాల‌న్నా వ‌ర్మ‌కే సాధ్య‌మ‌వుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: