పార్లమెంట్ లో ఢిల్లీ అల్లర్లపై రచ్చ కొనసాగింది. ఉభయసభలు ఈ నెల 11వ తేదీకి వాయిదా పడ్డాయి. లోక్ సభలో ఎంపీల సస్పెన్షన్ పై.. సభ లోపలా, బయటా కాంగ్రెస్ నిరసన తెలిపింది. అటు సభ్యుల ప్రవర్తనతో మనసు నొచ్చుకున్న స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు కూడా సభకు హాజరుకాలేదు.

 

ఏడుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం.. లోక్‌సభను కుదిపేసింది. కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యేంతవరకూ సస్పెండ్ చేయడం అసాధారణమని, ఎంతమాత్రం సహేతుకం కాదని లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. వెంటనే ఎంపీలపై సస్పెన్షన్‌ను స్పీకర్ రద్దు చేయాలని కోరారు. ఆయన వాదనతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విభేదించారు. సమావేశాలు పూర్తయ్యేంతవరకూ సస్పెన్సన్ కొనసాగించాల్సిందేనని, తద్వారా సభలో ఒక సంప్రదాయం నెలకొల్పినట్టు అవుతుందని అన్నారు. పార్లమెంటు బయట ఎంపీలను ఉంచాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని, అయితే గురువారం సభలో ఏమి జరిగిందో అందరికీ తెలుసన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ. 

 

కాగా ఎంపీల సస్పెన్సన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూడా కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఇందులో పాల్గొన్నారు.ఎంపీలంతా చేతులకు నల్లటి బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఢిల్లీ హింసాకాండకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

 

దేశ రాజధానిలో ఇటీవల జరిగిన హింసాకాండపై చర్చ జరపాలంటూ విపక్షాల ఆందోళన రాజ్యసభలోనూ  కొనసాగింది. రాజ్యసభ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వీలుగా అధికార, విపక్ష సభ్యులు కలిసి చర్చించుకొని, అర్ధవంతమైన పరిష్కారం కనుగొనాలని ఛైర్మన్ వెంకయ్య నాయుడు సూచించారు. అయితే ఆలస్యం చేయేకుండా ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. గందరగోళ పరిస్థితుల మధ్య సభను ఈనెల 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు. 

 

మరోవైపు లోకసభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా అలక వీడలేదు. వరుసగా రెండోరోజూ సభకు రాలేదు. సభలోని అన్ని పార్టీలు కూడా సభ్యతతో నడుచుకుంటామని, సభా కార్యకలాపాలకు అడ్డుపడమని హామీ ఇస్తేనే తాను సభకు హాజరవుతానని స్పీకర్ ఖచ్చితంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌తో సహా అన్ని పక్షాల సభ్యులు ఆయనను కలిసి సభకు హాజరు కావాలని కోరారు. అయితే స్పీకర్ మాత్రం  తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని కోరినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: