ఆంధ్ర ప్రదేశ్ లో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తుంటే , మరొకవైపు కరోనా వైరస్ కారణంగా ప్రచారం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి . రాష్ట్రం లో కరోనా అనుమానిత కేసులు నమోదవుతున్న నేపధ్యం లో ఎన్నికల వాయిదా వేయడమే బెటరని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి , ఎన్నికల కమిషన్ కు విపక్షాలు సూచిస్తున్నాయి . కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపధ్యం లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా ఇబ్బందికరంగా  మారే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు .

 

  లండన్ లో కూడా కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేశారంటూ  ఎన్నికల కమిషన్ దృష్టికి విపక్షాలు తీసుకువెళ్లాయి . అయితే కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేసే అవకాశాలేంత మాత్రం కన్పించడం లేదు . స్థానిక సంస్థల ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ,  నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయని ఈసీ సూత్రప్రాయంగా వెల్లడించింది . ఇక బీసీ రిజర్వేషన్ల కు సంబంధించి టీడీపీ వేసిన పిటిషన్ సుప్రీం లో పెండింగ్ లో ఉన్నందు వల్ల, ఎన్నికలు వాయిదా వేయాలని ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు .

 

అంతటితో ఆగకుండా తాము వేసిన పిటిషన్ లో ప్రభుత్వం కూడా ఇంప్లిడ్ కావాలని సూచించారు . అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న కృత నిశ్చయం తో ఉన్నట్లు స్పష్టం అవుతోంది . విపక్షాలు చేస్తున్న వాదన అర్థరహితంగా ఉందని వైస్సార్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు . కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం అర్థరహితంగా ఉందని మండిపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: