రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల నుంచి పోర్టు నిర్మాణ పనులు చేపట్టాలని  సర్కారు నిర్ణయించింది. అయితే ...రామాయపట్నంలో మైనర్ పోర్టు కాకుండా మేజర్ పోర్టు నిర్మించాలని ప్రకాశం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి భారీ ఓడరేవు నిర్మించాలని కోరుతున్నారు.

 

ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం దగ్గర ఓడరేవు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇక్కడ భారీ ఓడరేవు నిర్మించేందుకు 2014లోనే  కేంద్రం అనుమతించింది. అప్పుడు అధికారంలో ఉన్న యుపీఏ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరవై ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో రెండో పెద్ద ఓడరేవు నిర్మించేందుకు ప్రతిపాదనలు సైతం సిధ్ధం చేసింది. 

 

ఇక...కేంద్రం నుంచి రామాయపట్నం పోర్టుకు అనుమతి సాధించేందుకు రాష్ట్రానికి చెందిన అప్పటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శ్రమించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. ఓడరేవు నిర్మాణానికి రాష్ట్రంలోని రామాయపట్నం, దుగరాజుపట్నం, నక్కపల్లి ప్రాంతాలను పరిశీలించింది. దుగరాజుపట్నం దగ్గర ఓడరేవు నిర్మాణానికి షార్ కేంద్రం అభ్యంతరం చెప్పింది. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని కేంద్ర కమిటీ నిర్ణయించింది. దీనిపై నివేదిక కూడా ఇచ్చింది. ఇక అంతా అనుకూలమే అనుకుంటున్న సమయంలో కేంద్రంలో ప్రభుత్వం మారిపోయింది. ఫలితంగా రామాయపట్నం పోర్టు నిర్మాణ వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది. 

 

మరోవైపు...రామాయపట్నం పోర్టు నిర్మాణం విషయంలో టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్దంతోనే ఐదేళ్లు గడిచిపోయాయి. రామాయపట్నంలో  పోర్టు నిర్మాణానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దీంతో 2019 సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండానే మైనర్ పోర్టు నిర్మిస్తామని ప్రకటించారు. ఐతే మైనర్ పోర్టు నిర్మాణంతో జిల్లాలో ఉపాది అవకాశాలు మెరుగుపడవనే విమర్శలు వెల్లువెత్తాయి. రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మాణం చేపడితే వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. రామాయాపట్నంలో ఓడరేవు నిర్మాణంపై గత ఏడేళ్లుగా ప్రకటనలు, శంకుస్థాపనలతోనే సరిపోయింది. 

 

ఇక...తాజాగా రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణంపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓడరేవు  నిర్మాణ పనులు ఏప్రిల్ నెలలో మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో కేంద్రంతో సంబంధం లేకుండా మైనర్ పోర్టు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. మైనర్ పోర్టు కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి భారీ పోర్టు నిర్మించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మొత్తానికి...ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఓడ రేవు నిర్మాణం పూర్తయితే యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించే ఛాన్స్ ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: