చూస్తుంటే అలాగే ఉంది టిడిపి నేతలు వ్యవహారం చూస్తుంటే. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఈ దశలొనే టిడిపి ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంఎల్ఏ రామానాయుడుతో పాటు మాజీ ఎంఎల్ఏలు కొల్లు రవీంద్ర తదితరులు జగన్మోహన్ రెడ్డికి ఓ లేఖ రాయటమే విచిత్రంగా ఉంది.  ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే 24 శాతం బిసిల రిజర్వేషన్ తో ఎన్నికలు జరపకూడదని చెప్పటంతో పాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని  కోరటమే విచిత్రంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల వాయిదాకు టిడిపి నేతలు చూపించిన రెండు కారణాలు కూడా పనికిమాలినవే. ఎన్నికల వాయిదాకు వాళ్ళు చెప్పిన కారణాలు కాకుండా  ఓటమి భయంతోనే ఎన్నికల వాయిదాను కోరుతున్నట్లు తెలిసిపోతోంది. ఓటమి భయమంటే జనాలందరూ నవ్వుతారు కాబట్టి బిసిల రిజర్వేషన్ అని కరోనా వైరస్ అంటూ కతలు చెబుతోంది. సరే ప్రతిపక్షం అడిగినట్లుగా ఎన్నికలను అధికార పార్టీ వాయిదా వేస్తుందా లేదా అన్నది వేరే సంగతి. వాయిదా అడిగేటపుడు కనీసం వాస్తవానికి దగ్గరగా ఉండే కారణాలు చెప్పాలన్న ఇంగితం కూడా లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

రెండు కారణాలు తప్పని ఎలా చెబుతున్నామంటే బిసిల రిజర్వేషన్ 34 నుండి 24 శాతానికి తగ్గిపోవటానికి  తెలుగుదేశంపార్టీనే కారణం. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో వివిధ కేటగిరీలకు కేటాయించిన రిజర్వేషన్లలో బిసిలకు 34 శాతమే ఉంది. అయితే ప్రభుత్వం ఎక్కడ లబ్దిపొందుతో అన్న దుర్బుద్దితో చంద్రబాబునాయుడు వెంటనే తన మద్దతుదారుడితో కోర్టులో కేసు వేయించాడు. కేసు విచారణ జరిపిన కోర్టు బిసిల రిజర్వేషన్ 34 శాతం చెల్లదంటూనే రిజర్వేషన్ ను 24 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది.

 

అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టిడిపి కేసు వేయకపోతే 34 శాతంతోనే ఎన్నికలు జరిగిపోయేవే అనటంలో సందేహం లేదు. అంటే హైకోర్టులో బిసిల రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కేసు వేయించి సుప్రింకోర్టులో హై కోర్టు తీర్పును సవాలు చేస్తు మళ్ళీ టిడిపినే కేసు వేసింది. సుప్రింకోర్టులో కేసు ఎందుకు వేసిందంటే ఎన్నికలు జరగకుండా వాయిదా వేయించేందుకే అని అర్ధమైపోతోంది. పైగా ఎన్నికల వాయిదాకు కరోనా వైరస్ ను కూడా సాకుగా చూపటమే అన్నింటికన్నా విచిత్రంగా ఉంది. చూడబోతే వైసిపి నేతలు చెబుతున్నట్లుగా చంద్రబాబుకే వైరస్ సోకిందేమో అన్న అనుమానంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: